
చిత్రకూట్: బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రత్యేకమైన సంతలో మాత్రం వీరందరినీ ఓడించింది ‘చంకీ పాండే’! అదేంటి.. బాలీవుడ్ నటుడు చంకీ పాండే గాడిదల సంతలోకి వచ్చారా? అనుకుంటున్నారా? అదేం కాదు. ఆయన పేరుతో ఉన్న ఓ నల్లటి గాడిద ఏకంగా రూ.72 వేల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమితాబ్, షారుఖ్, మిథున్ పేర్లతో ఉన్న గాడిదల కంటే ఎక్కువ ధరకు అమ్ముడై ఈ ఏడాది సంతలో టాప్ ప్లేస్ దక్కించుకుంది.
దీపావళి తర్వాత ప్రత్యేకమైన గాడిదల సంత
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో, ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని చిత్రకూట్ పట్టణంలో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత మందాకిని నది ఒడ్డున ఈ ప్రత్యేకమైన గాడిదల సంత నిర్వహిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంతకు మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తమ గాడిదలను తీసుకొస్తారు. తెల్లవారుజాము నుంచే కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారంభమవుతాయి. జంతువులను చూసేందుకు సైతం పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు.
బాలీవుడ్ హీరోల పేర్లతో గాడిదలు
ఈ ఏడాది సంతలో అసలైన ప్రత్యేక ఆకర్షణ గాడిదలకు పెట్టిన పేర్లే. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి, చంకీ పాండే వంటి బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో గాడిదలను వ్యాపారులు తీసుకొచ్చారు. దీంతో సందర్శకులు వాటిని చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపించారు. సెలబ్రిటీల పేర్లతో ఉన్న ఈ గాడిదలు సంతలో సందడి చేశాయి.
అయితే ధరల విషయంలో మాత్రం అందరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి పేర్లతో ఉన్న గాడిదలు ఒక్కొక్కటి రూ.50 వేల లోపే అమ్ముడయ్యాయి. కానీ నల్లటి రంగులో, మంచి శరీర దారుఢ్యంతో ఉన్న ‘చంకీ పాండే’ మాత్రం ఏకంగా రూ.72 వేలు పలికింది. దీంతో ఈ ఏడాది సంతలో అత్యధిక ధరకు అమ్ముడైన గాడిదగా నిలిచింది.
గాడిద ధర ఎలా నిర్ణయిస్తారంటే?
ఈ సంతలో గాడిదలకు పేర్లు ఎంత ఆకర్షణగా ఉన్నప్పటికీ, వాటి ధరలను నిర్ణయించేది మాత్రం శారీరక లక్షణాలే. గాడిద జాతి, ఎత్తు, శరీర నిర్మాణం, పొడవు, బలం వంటి అంశాలను పరిశీలించి వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. ఈ ఏడాది చంకీ పాండే పేరుతో ఉన్న గాడిద మంచి శరీర దారుఢ్యం కారణంగా అధిక ధరను సొంతం చేసుకుంది.
ఔరంగజేబు కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం!
స్థానిక కథనాల ప్రకారం చిత్రకూట్ గాడిదల సంతకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి చరిత్ర ఉందని చెబుతారు. అప్పట్లో సైనిక సామగ్రి, ఇతర వస్తువుల రవాణాకు గాడిదలు, కంచర గాడిదలను విస్తృతంగా ఉపయోగించేవారని స్థానికులు చెబుతుంటారు. అప్పటి నుంచి దీపావళి సమయంలో ఈ సంత నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు.
గతేడాది లారెన్స్ బిష్ణోయ్ పేరుతో గాడిద!
ఈ సంతలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గత ఏడాది బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో పాటు జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో కూడా ఓ గాడిదను అమ్మకానికి తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ పేర్లతో ఉన్న గాడిదలతో పాటు అది కూడా సందర్శకులను ఆకర్షించింది. గత ఏడాది షారుఖ్ అనే గాడిద అత్యధిక ధర పలికిందని స్థానికుడు ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని మఝ్గావన్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మహిపాల్ సింగ్ గుర్జర్ కూడా ప్రస్తావించారు. చిత్రకూట్‌లో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఈ సంత నిర్వహిస్తారని, ఈ ఏడాది అత్యధికంగా రూ.72 వేల ధర పలికిందని తెలిపారు.
మొత్తానికి బాలీవుడ్లో స్టార్ హీరోల మధ్య ఉండే పోటీని తలపించేలా చిత్రకూట్ గాడిదల సంతలోనూ పేర్లతో ఆసక్తికర సందడి నెలకొంది. అమితాబ్, షారుఖ్, మిథున్‌లను వెనక్కి నెట్టి ‘చంకీ పాండే’ రూ.72 వేల ధరతో విజేతగా నిలవడం ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. పేర్లు సెలబ్రిటీలవైనా.. ధర మాత్రం గాడిదల దేహదారుఢ్యంపైనే ఆధారపడుతుందని ఈ సంత మరోసారి నిరూపించింది!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..