Lemons: నిమ్మకాయలు నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.. అస్సలు చెడిపోవు..

నిమ్మకాయలు త్వరగా పాడైపోతున్నాయా? అయితే ఈ సింపుల్ ట్రిక్ మీకోసమే. ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. తర్వాత ప్రతి నిమ్మకాయపై సన్నగా నూనె రాసి, టిష్యూ పేపర్ వేసిన డబ్బాలో నిల్వ చేయాలి. పైభాగాన కూడా టిష్యూ పేపర్ ఉంచి మూత గట్టిగా మూసేస్తే, నిమ్మకాయలు నెలరోజులకు పైగా తాజాగా ఉంటాయి.

Lemons: నిమ్మకాయలు నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.. అస్సలు చెడిపోవు..
Lemon Storege

Updated on: May 26, 2026 | 4:31 PM

నిమ్మకాయలను నెలరోజులకు పైగా తాజాగా, కుళ్లిపోకుండా నిల్వ ఉంచడం ఎలాగో చాలామందికి తెలియదు. మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ నిమ్మకాయలు కొని తెచ్చుకోవడం సాధారణం.. అయితే.. ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కేజీ రూ.250 కిపైగానే ధర పలుకుతోంది. అయితే, నిమ్మకాలు ఫ్రిజ్‌లో పెట్టినా కూడా అవి త్వరగా పండిపోయి లేదా కుళ్లిపోయి పాడవుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సరళమైన.. ప్రభావవంతమైన పద్ధతిని అనుసరించడం ద్వారా మీరు నిమ్మకాయలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఇది ఫ్రిజ్ ఉన్నా లేకపోయినా ఉపయోగపడుతుంది.

మొదటి దశలో, నిమ్మకాయలను శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో నీరు తీసుకొని, అందులో నిమ్మకాయలను వేసి శుభ్రంగా కడగాలి. నిమ్మకాయలపై ఉన్న దుమ్ము, మట్టిని తొలగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కడిగిన తర్వాత, నిమ్మకాయలను పొడిబట్ట మీద వేసి, వాటిని తడి లేకుండా పూర్తిగా తుడవాలి. ఈ దశలో నిమ్మకాయలపై ఏ మాత్రం తడి ఉండకూడదు. తడి ఉంటే అవి త్వరగా పాడైపోతాయి. పొడిబట్టతో తుడిచిన తర్వాత, నిమ్మకాయలను సుమారు పది నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి. ఇది నిమ్మకాయలు పూర్తిగా పొడిగా మారడానికి సహాయపడుతుంది.

తరువాత, ఆరబెట్టిన నిమ్మకాయలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనం సాధారణంగా వంటకు ఉపయోగించే నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా మరేదైనా శుద్ధి చేసిన నూనె) ఒక టీస్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఒక వేలిని నూనెలో ముంచి, ప్రతి నిమ్మకాయకు సన్నటి పొరలా నూనెను పూయాలి. నిమ్మకాయలు అన్ని వైపులా నూనెతో కవర్ అయ్యేలా చూసుకోవాలి. నూనె పూయడం వల్ల నిమ్మకాయపై ఒక రక్షణ పొర ఏర్పడి, గాలి తగలకుండా, తేమను కోల్పోకుండా నిల్వ ఉంటుంది. ఇది కుళ్లిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

చివరి దశలో, నిమ్మకాయలను నిల్వ చేయడానికి ఒక మూత ఉన్న డబ్బాను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు.. గాజు డబ్బా అయితే ఇంకా మంచిది. డబ్బా అడుగున ఒక టిష్యూ పేపర్‌ను పరవాలి. టిష్యూ పేపర్‌కు బదులుగా న్యూస్‌పేపర్ లేదా నోట్స్ పేపర్ కూడా ఉపయోగించవచ్చు. ఈ పేపర్‌పై నూనె రాసిన నిమ్మకాయలను జాగ్రత్తగా సర్దాలి. అన్ని నిమ్మకాయలు సర్దిన తర్వాత, వాటి పైన మరొక టిష్యూ పేపర్‌ను ఉంచి, డబ్బా మూతను గట్టిగా మూసేయాలి. ఇలా నిల్వ చేయడం వల్ల నిమ్మకాయలు నెలరోజులకు పైగా తాజాగా, దృఢంగా ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా నిమ్మకాయలు పాడవకుండా, వాటి రసం, రుచి మారకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.

చిన్న సీక్రెట్ మేడమ్.. ఇదొక్కటి చేస్తే.. మల్లెలు గుత్తులు గుత్తులుగా పూస్తాయ్..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us