
ప్రేమ.. ఈ రెండక్షరాల పదం ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అదే సమయంలో ఎంతో మంది ఊపిరి తీసింది. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చినవారు కొందరైతే.. అదే ప్రేమ కోసం ప్రాణాలు తీసిన వారు మరికొందరు. ప్రేమ అనగానే తల్లిదండ్రులకు ఎక్కడా లేని కోపం వస్తుంది.. పెళ్లికి ససేమీరా అంటారు. ఇక్కడ ఎవరి కారణాలు వారివి.. అదే సమయంలో ఎవరి హక్కులను కాదనలేం.. కులం, మతం, ప్రతిష్ట లేదా సమాజంలో తమ గౌరవం వంటి కారణాలతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రేమను వ్యతిరేకిస్తారు. దీంతో కొందరు తమ ప్రేమను త్యాగం చేయగా.. మరికొందరు పెద్దలను ఎదురించి ఒక్కటవుతారు. అయితే దేశంలో ప్రేమ వివాహం చేసుకునే జంటకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరా..? వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం నేరమా..? దీనిపై చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం..
భారతీయ చట్టం ప్రకారం.. వివాహానికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. చట్టం ఈ విషయంలో స్పష్టమైన నియమాలను ఇచ్చింది. వివాహం చేసుకోవడానికి అబ్బాయికి 21ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు ఉండాలి. 18ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి తమ ఇష్టానుసారం ఎవరినైనా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంది. దీనికి తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి కాదు. తమ లైఫ్ పార్ట్‌నర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది.
వివిధ కులాలు, మతాలు లేదా వర్గాల వ్యక్తులు వివాహం చేసుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. వేరే కులం, మతం వారిని పెళ్లి చేసుకోవాలంటే ప్రత్యేక వివాహ చట్టం, 1954 ఉపయోగపడుతుంది. ఈ చట్టం కింద మీరు కోర్టులో పెళ్లి చేసుకోవచ్చు. దీనికి కూడా పేరెంట్స్ అనుమతి అవసరం లేదు. జంటగా కోర్టులో నోటీస్ ఇస్తే సరిపోతుంది.
చట్టం ప్రకారం అనుమతి అవసరం లేనప్పటికీ.. సంతోషకరమైన, బలమైన వివాహ జీవితానికి పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా వివాహానికి అంగీకరించకపోతే, చట్టపరమైన వయస్సు ఉన్న జంట కోర్టు ద్వారా తమ వివాహ జీవితాన్ని చట్టబద్ధంగా ప్రారంభించవచ్చు. అయితే సాధ్యమైనంతవరకు పెద్దల మార్గదర్శకత్వం, ఆశీర్వాదంతో వివాహం చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని గుర్తుంచుకోండి..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..