షటిల్ కాక్ తయారీ వెనుక ఇంత కథ ఉందా.. అసలు అవి ఏ పక్షి ఈకలో తెలుసా..?

చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపించే షటిల్ ఆట వెనుక 150 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా..? కేవలం వినోదం కోసం మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఉర్రూతలూగిస్తున్న ఈ క్రీడ పుట్టింది మన దేశంలోనే. అసలు ఈ ఆటకి ఆ పేరు ఎలా వచ్చింది? షటిల్ కాక్ తయారీలో దాగున్న ఆ వింత రహస్యాలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

షటిల్ కాక్ తయారీ వెనుక ఇంత కథ ఉందా.. అసలు అవి ఏ పక్షి ఈకలో తెలుసా..?
How Shuttlecock Is Made

Updated on: Jan 26, 2026 | 7:21 PM

ప్రస్తుతం మన వీధుల్లో, పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆట బ్యాడ్మింటన్. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ విజయాలతో ఈ ఆట భారతీయుల లైఫ్‌లో భాగమైపోయింది. అయితే ఇది కేవలం ఆట మాత్రమే కాదు శరీరాన్ని ఉక్కులా మార్చే ఒక అద్భుతమైన ఫుల్ బాడీ వర్కవుట్. వేగంగా కదలడం, అమాంతం ఎగరడం, క్షణాల్లో స్పందించడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆధునిక బ్యాడ్మింటన్ పుట్టింది మన దేశంలోనే.. 1870లలో మహారాష్ట్రలోని పూణే నగరంలో బ్రిటిష్ అధికారులు ఈ ఆటను క్రియేట్ చేశారు. అప్పట్లో దీనిని పూనా అని పిలిచేవారు. 1873లో ఇంగ్లాండ్‌లోని డ్యూక్ ఆఫ్ బ్యూఫోర్ట్ తన ఎస్టేట్ అయిన బ్యాడ్మింటన్ హౌస్‌లో ఈ ఆటను ప్రదర్శించినప్పుడు దీనికి ఆ ఎస్టేట్ పేరే స్థిరపడిపోయింది. 1893లో అసోసియేషన్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తమైన ఈ క్రీడ నేడు 100కు పైగా దేశాల్లో ప్రధాన ఆటగా వెలుగొందుతోంది.

షటిల్ కాక్ ఈకల రహస్యం..?

బ్యాడ్మింటన్‌లో అత్యంత కీలకమైనది షటిల్ కాక్. దీనిని గమనిస్తే చాలా తేలికగా కనిపిస్తుంది కానీ, దీని వెనుక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. పేరులో కాక్ ఉన్నప్పటికీ.. వీటి తయారీలో కోడి ఈకలను వాడరు. చైనా వంటి దేశాల్లో పెద్ద బాతు ఈకలను వాడితే, భారత్‌లో సాధారణ బాతు ఈకలను ఉపయోగిస్తారు. షటిల్ కాక్ తయారీలో ఒక ఆసక్తికరమైన రహస్యం ఉంది. ఒక షటిల్ కాక్ తయారీకి కేవలం బాతు ఎడమ వైపు రెక్కల ఈకలను మాత్రమే వాడతారు. ఎందుకంటే ఎడమ రెక్క ఈకలు గాలిలో తిరుగుతూ వెళ్లడానికి అనుకూలంగా ఉంటాయి. కుడి, ఎడమ రెక్కల ఈకలను కలిపి వాడితే కాక్ గాలిలో సరిగ్గా ప్రయాణించదు. మొత్తం 16 ఈకలను గుండ్రని కార్క్‌పై అమర్చి.. దారం, జిగురుతో సెట్ చేస్తారు. దీని బరువు కేవలం 4.74 నుండి 5.50 గ్రాముల మధ్య ఉంటుంది.

ఎందుకు అంత వేగంగా దూసుకెళ్తుంది?

షటిల్ కాక్ ఆకారం శంఖువు వలె ఉంటుంది. అందుకే ఇది రాకెట్ ద్వారా కొట్టినప్పుడు గాలిని చీల్చుకుంటూ అత్యంత వేగంగా వెళ్తుంది. ప్రపంచ రికార్డుల ప్రకారం.. షటిల్ కాక్ గంటకు 400-500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇది ఒక బుల్లెట్ వేగంతో సమానం. ఇలా ఒకప్పుడు కేవలం వినోదంగా మొదలైన బ్యాడ్మింటన్, నేడు ప్రతి ఇంట్లో ఆరోగ్య సాధనంగా మారింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..