
మరో నాలుగు రోజుల్లో మనమందరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో చాలా మంది కొత్త సంవత్సరం తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అంతేగాక, తాము చేయాల్సిన పనులను షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం పెండింగ్‌లో ఉన్న పనులను కొత్త ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు సంతోషంగా గడిపితే ఏడాదంతా ఆనందంగా ఉంటారని చాలా మంది నమ్ముతుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం ప్రారంభరోజు అందరికీ కీలకంగా మారనుంది.
కొత్త ఏడాది పొడవునా మీకు సానుకూలంగా ఉండాలంటే మొదటి రోజు అంటే జనవరి 1, 2026 ఈ పని చేయాలి. మీ ఇంటిపై చెడు కళ్లు పడకుండా ఉండేందుకు, శాంతి, ఆనందం నెలకొనేందుకు ఆరోజు ఇలా చేయాలి. కొత్త సంవత్సరం తొలి రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. ఉదయమే స్నానం చేసి పూజ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఇంటి అంతటా గంగాజలం(నీరు) చల్లుకోండి.
ముఖ్యంగా ఒక పాత్రను నీటితో నింపి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. ఈ పాత్రను ఏదైనా లోహంతో తయారుచేసినదై ఉండేలా చూసుకోండి. ఇత్తడి లేదా రాగిదేతే ఇంకా మంచిది. ఉదయం నుంచి రాత్రి వరకు దీన్ని ఒకే చోట ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరం రోజున ఒక పాత్రలో నీటితో నింపి ఇంటి ప్రధాన ద్వారా దగ్గర ఉంచడం వల్ల ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది.
కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటి లోపలి భాగం మాత్రమే కాకుండా ఇంటి ప్రధాన ద్వారా, ఇంటి ప్రాంగణం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి తలుపు వద్ద మురికి చెప్పులు, షూలు ఉంచరాదు. మీ ఇంట్లో ఏవైనా విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులు ఉంటే.. కొత్త ఏడాదికి 3-4 రోజుల ముందే వాటిని పారవేయండి. పగిలిన గాజును కూడా ఇంట్లో ఉంచకూడదు.
మీ దగ్గర ఉన్న గడియారం పనిచేయకపోతే.. దాన్ని కూడా సరిచేయండి. పూర్తిగా దెబ్బతింటే పారవేయండి. ఇక, నూతన సంవత్సరం రోజున మొక్కలు నాటడం మంచిది. అయితే, ముళ్ల మొక్కలను నాటవద్దు. తులసీ లేదా మనీ ప్లాంట్ నాటవచ్చు. వాస్తు ప్రకారం ఈ పనులు చేయడం వల్ల మీ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది.