ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు అర్థం తెలుసా..? బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేశారంటే..

Traffic Sign Board: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నాలుగు నల్లటి వృత్తాల ప్రత్యేక ట్రాఫిక్ గుర్తు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది. బెంగుళూరులో ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు కనిపించడంతో ఓ వ్యక్తి దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సైన్ బోర్డును ఎందుకు ఏర్పాటు చేశారో? వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఇంతకీ ఈ సైన్ బోర్డు అర్థం ఏంటో తెలుసుకుందాం రండి..

ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు అర్థం తెలుసా..? బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేశారంటే..
Traffic Sign Board
Image Credit source: Social Media

Updated on: Aug 29, 2026 | 1:45 PM

సాధారణంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ట్రాఫిక్ సైన్ బోర్డు (Traffic Sign Board) వాహనదారులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంటాయి. ప్రతి గుర్తుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అయితే బెంగళూరులోని హోప్ ఫార్మ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన బోర్డు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్లటి రంగులో ఉన్న ఆ బోర్డుపై నాలుగు నల్లటి వృత్తాలు కనిపిస్తాయి. ఈ గుర్తుకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో అనిరుద్ధ ముఖర్జీ అనే ప్రయాణికుడు బోర్డును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఈ గుర్తుకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ట్రాఫిక్ అధికారులను కోరారు.

ఈ పోస్టుపై స్పందించిన వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు ఆ గుర్తుకు సంబంధించిన వివరణ ఇచ్చారు. ఈ నాలుగు నల్లటి వృత్తాల గుర్తు ఉన్న బోర్డు ఆ ప్రాంతంలో దృష్టి లోపం ఉన్న వ్యక్తులు రోడ్డుపై నడిచే అవకాశం ఉందని వాహనదారులను అప్రమత్తం చేయడానికి ఇది ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోప్ ఫార్మ్ జంక్షన్ సమీపంలో చూపులేని విద్యార్థుల కోసం ఓ పాఠశాల ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రోడ్డు దాటే లేదా రోడ్డుపై నడిచే దృష్టి లోపం ఉన్నవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

అందువల్ల ఈ గుర్తు కనిపించినప్పుడు వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేగాన్ని తగ్గించి, రోడ్డుపై నడిచే పాదచారులకు, ముఖ్యంగా చూపులేని వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనం నడపడం అవసరం. దృష్టి లోపం ఉన్న వ్యక్తులు రోడ్డుపై ఉన్నప్పుడు హారన్‌ను పదేపదే మోగించడం లేదా వేగంగా వాహనం నడపడం సరికాదు.

ఇవి కూడా చదవండి

రోడ్డు భద్రతలో ఇలాంటి ప్రత్యేక సూచికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ట్రాఫిక్ గుర్తు వెనుక ఒక నిర్దిష్ట ఉద్దేశం ఉంటుంది. అందువల్ల కొత్తగా కనిపించే గుర్తులను చూసినప్పుడు వాటి అర్థాన్ని తెలుసుకుని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత.

Loading...
Unable to load recommendations.
Follow Us