గ్రామాల్లోకి పులి వస్తే.. పట్టుకునేందుకు అధికారులు ఎవరి పర్మిషన్ తీసుకుంటారో తెలుసా?

ఈ మధ్య కాలంలో తరచూ పులులు అడవులు వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు పులిని త్వరగా బంధించి తమకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరారు. ఈ క్రమంలో పులిని పట్టుకోవడంపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయి. అధికారులు పులిని ఎలా పట్టుకుంటారు. పులిని పట్టుకోవడానికి అధికారులకు కూడా అనుమతులు కావాలా అనే ప్రశ్న సర్వత్రా వినిపించింది. కాబట్టి పులిని పట్టుకునేప్పుడు అధికారులు ఎలాంటి పద్దతులను అనుసరిస్తారో తెలుసుకుందాం.

గ్రామాల్లోకి పులి వస్తే.. పట్టుకునేందుకు అధికారులు ఎవరి పర్మిషన్ తీసుకుంటారో తెలుసా?
Capturing Tigers Near Villages

Edited By:

Updated on: Feb 13, 2026 | 7:07 AM

జనవాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే సాయంత్రం, రాత్రి సమయాల్లో పులి కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్‌లు, థర్మల్ కెమెరాలను వాడుతున్నారు. ఈ బృందంలో రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్, రెవెన్యూ సిబ్బంది, సివిల్ పోలీసులు, భారీ సంఖ్యలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొంటారు. పులిని పట్టుకోవడంలో అధికారుల ప్రథమ లక్ష్యం ఏమిటంటే.. దానిని సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపించడం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, అధికారుల నుండి అనుమతులు తీసుకుని, మత్తు మందు (ట్రాంక్విలైజ్) ఇచ్చి పులిని పట్టుకుంటారు. ఆ తర్వాత దానిని జూకు లేదా సఫారీకి తరలించి, పరిస్థితులను బట్టి తిరిగి అడవిలోకి వదిలేందుకు ప్రయత్నిస్తారు.

పులిని పట్టుకునేందుకు ఎవరి అనుమతి తీసుకోవాలి

అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకోవాలంటే మొదట రాష్ట్ర ప్రభుత్వంలోని అటవీ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. పులి ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉంటే లేదా ఇప్పటికే హాని చేసి ఉంటే, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతి అవసరం. ఆ తర్వాత, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) నివేదిక ఆధారంగా పులిని సురక్షితంగా పట్టుకోవడానికి లేదా మత్తు మందు ఇచ్చి తరలించడానికి అనుమతులు లభిస్తాయి.

అయితే, పులిని పట్టుకోవడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అనుమతులు కూడా అవసరమని జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఇది క్షేత్రస్థాయిలో జరిగే పని కాబట్టి పీఎంఓ అనుమతి అవసరం లేదని, అయితే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానితమైన కార్యాలయాలకు చేరవేయబడుతుందని తెలిపారు.

పులి అటవి నుంచి బయటకొచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది

పులి అటవీ ప్రాంతం దాటి జనావాసాల్లోకి వచ్చినప్పుడు దాని ప్రవర్తన ఎలా ఉంటుందో అధికారులు వివరించారు. అడవిని దాటి బయటకొచ్చిన పులికి మనుషుల వాసనలు, వాహనాల శబ్దాలు, లైట్లు కొత్తగా అనిపించి దాని ప్రవర్తనలో మార్పు వస్తుందని.. పులి చాలా తెలివైన జంతువు కాబట్టి, అది ఉదయం పూట కాకుండా రాత్రి సమయంలో మాత్రమే తిరుగుతుందన్నారు. మనుషులకు కనపడకుండా, పశువులు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆకలి వేసినప్పుడు మాత్రమే దాడి చేస్తుందని, సాధారణంగా మనుషులపై దాడి చేయదని ఆయన తెలిపారు.

పులులు ఎందుకు జనావాసాల్లోకి వస్తాయి

పులి అడవిని వదిలి జనావాసాల్లోకి రావడానికి అనేక కారణాలున్నాయని అధికారులు తెలిపారు. పులి సహజంగా అడవిని వదిలి బయటకు రాదని.. అయితే, తన నివాస ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, ఆహారం దొరకనప్పుడు, లేదా తోడును వెతుక్కుంటూ ప్రయాణించినప్పుడు జనావాసాల గుండా వెళ్లాల్సి వస్తుందని వారు వివరించారు.

పులి కనిపిస్తే ఏం చేయాలి!

పులి కనిపించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి కనిపించకండా దూరంగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పులికి ఎటువంటి హాని చేయకూడదని.. ఎక్కడైనా పులి కనిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 1 ప్రకారం.. పులికి హాని చేయడం చట్టరిత్యా నేరమన్నారు. అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా ఉన్న పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందిని.. “పులి లేకపోతే అడవి ఉండదు, అడవి ఉండకపోతే మనిషికి మనుగడ ఉండదు అనే వాస్తవాన్ని అందరూ గుర్తించుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us