AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న తర్వాత నడవొచ్చా..? ఎంతసేపు నడవాలి..? పూర్తి వివరాలు..

భోజనం తర్వాత వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి బరువు పెరిగే ప్రమాదం ఉంది. కేవలం 15 నిమిషాల నడకతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ చిన్న అలవాటుతో ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

తిన్న తర్వాత నడవొచ్చా..? ఎంతసేపు నడవాలి..? పూర్తి వివరాలు..
Post Meal Walk
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2026 | 1:46 PM

Share

ఈ కథనంలో మీకు అందించిన ఆరోగ్య సూచనలు, సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, శాస్త్ర పరిశోధనలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం సమాచారం అందించాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యులు, సంబంధిత నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

భోజనం చేసిన తర్వాత మీరు వెంటనే కూర్చుంటున్నారా లేదా పడుకుంటున్నారా? ఎక్కువ కాలం ఇలా చేస్తుంటే మీ ఆరోగ్యాన్ని మీరే దెబ్బ తీసుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భోజనం చేసిన తర్వాత ఒక్క రూల్ తప్పనిసరిగా పాటించాలి. అదే సుమారు 15 నిమిషాలు నడవడం. భోజనం చేశాక చేసే ఈ చిన్న పనే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది. తిన్న వెంటనే కూర్చుంటే కలిగే నష్టాలు ఏంటి? 15 నిమిషాల నడక ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ రూల్ పాటిస్తే కలిగే లాభాలు ఏంటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

తిన్న వెంటనే కూర్చుంటే లేదా పడుకుంటే కలిగే నష్టాలు:

తిన్న వెంటనే కూర్చున్నా, నిద్రించినా జీర్ణక్రియకు ఇబ్బంది అవుతుంది. ఆహారం అంతా త్వరగా జీర్ణం కాదు. ఎక్కువ కాలం ఇలాగే చేస్తుంటే బరువు పెరిగే రిస్క్ అధికంగా ఉంటుంది. ఊబకాయం సమస్య ఎదురుకావచ్చు. గుండెల్లో మంట, ఎసిడిటీగా అనిపిస్తుంది. తిన్న వెంటనే విశ్రాంతి తీసుకుంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. డయాబెటిస్ రిస్క్ అధికమవుతుంది.

భోజనం తర్వాత నడిస్తే కలిగే ప్రయోజనాలు:

1. మెరుగైన జీర్ణక్రియ: ఆహారం తిన్నాక 15 నిమిషాల పాటు నడిస్తే జీర్ణక్రియకు బూస్ట్ లా ఉంటుంది. ఆహారం పొట్ట నుంచి ముందుకు వెళ్లే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. పొట్ట పట్టేసినట్టు ఉబ్బరంగా అనిపించడం తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది.

2. రక్తంలో చక్కెర నియంత్రణ: భోజనం చేశాక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం సహజం. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే ఈ స్పైక్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే తిన్న తర్వాత కచ్చితంగా నడవాలి. ఇలా చేస్తే గ్లూకోజ్‌ను కండరాలు శక్తిగా ఉపయోగించుకుంటాయి. దీంతో భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటుంది. భోజనం తర్వాత 15 నిమిషాలు వాకింగ్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మరింత ముఖ్యం. కొంతమంది ఉదయాన్నే వాకింగ్ చేసి తిన్న తర్వాత నడవకపోయినా ఏం కాదులే అనుకుంటారు. కానీ ఇది సరికాదని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ వాక్ చేసినా భోజనం తర్వాత నడవడం ముఖ్యమని అంటున్నారు. మీల్ తర్వాత 15 నిమిషాల నడకను అలవాటుగా మార్చుకుంటే డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు.

3. బరువు తగ్గడంలో సహాయం: తిన్న తర్వాత నడిస్తే శరీరం కొంత అదనపు శక్తిని ఉపయోగించుకుంటుంది. కొన్ని క్యాలరీలు బర్న్ అవుతాయి. దీంతో శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా తిన్న తర్వాత సుమారు 15 నిమిషాలు నడవడం ముఖ్యం. హెల్తీ డైట్, సరైన నిద్ర, ప్రతిరోజు వ్యాయామంతో పాటు భోజనం తర్వాత ఈ చిన్న నడకను కూడా అలవాటుగా మార్చుకుంటే వెయిట్ లాస్ జర్నీకి మరింత మేలు జరుగుతుంది.

4. గుండె ఆరోగ్యానికి రక్షణ: నడక అనేది సులువైన వ్యాయామం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీ కంట్రోల్‌లో ఉండేందుకు సహకరిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీర్ఘకాలం ఈ హ్యాబిట్ పాటిస్తే గుండె పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది.

నడక నియమాలు:

భోజనం చేశాక వేగంగా నడవాల్సిన అవసరం లేదు. రిలాక్స్‌డ్‌గా మీకు సౌకర్యంగా అనిపించేలా వాక్ చేస్తే సరిపోతుంది. ఈ అలవాటు ప్రారంభించిన కొత్తలో 10 నిమిషాలు నడవాలి. ఆ తర్వాత 15 నిమిషాలకు పెంచుకోవచ్చు. అయితే వీలైనంతవరకు తిన్న ప్రతిసారీ వాక్ చేయడం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ శరీరానికి ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఆపేయాలి. ఒకవేళ మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విషయంపై వైద్యుల సలహా తీసుకోవాలి.

Follow Us