
హెయిర్ కట్ పూర్తయిన తర్వాత బార్బర్లు చేసే మెడ మసాజ్, టక్ మనే శబ్దంతో మెడ తిప్పడం ప్రాణాలకే ప్రమాదకరమని న్యూరోసర్జన్లు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిజ్ఞానం లేని బార్బర్లు మెడను తీవ్రమైన వేగంతో, బలంగా తిప్పడం వల్ల మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హెయిర్ కట్ తర్వాత బార్బర్లతో మెడ మసాజ్, మెడ పటకలు తీయించుకోవడం ముమ్మాటికీ వద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఇప్పుడు చూద్దాం..
బార్బర్లకు మానవ శరీర నిర్మాణంపై, ముఖ్యంగా అత్యంత సున్నితమైన మెడ భాగానికి సంబంధించిన వైద్య పరిజ్ఞానం ఉండదు. ఫిజియోథెరపిస్టులు లేదా కైరోప్రాక్టర్లు ఎంతో శిక్షణ పొంది చేసే పనులను, బార్బర్లు ఎలాంటి అవగాహన లేకుండా తీవ్రమైన ఒత్తిడితో, ఉన్నపళంగా మెడను తిప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మన మెడ గుండా మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే వర్టెబ్రల్ ధమనులు ఉంటాయి. బార్బర్ మెడను బలంగా తిప్పినప్పుడు ఈ రక్తనాళాలు సాగిపోయి చిట్లిపోతాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతుంది. ఇది తీవ్రమైన స్ట్రోక్‌కు దారితీసి, క్షణాల్లో పక్షవాతం రావడం లేదా మరణం సంభవించడం జరుగుతుంది.
మెడ ఎముకల మధ్య ఉండే సున్నితమైన నాడులు దెబ్బతింటాయి. ముఖ్యంగా శ్వాసక్రియను నియంత్రించే ఫ్రెనిక్ నర్వ్ దెబ్బతింటే మనిషి సొంతంగా శ్వాస తీసుకోలేక వెంటిలేటర్‌పై ఆధారపడాల్సి వస్తుంది.
మెడను తరచుగా లేదా బలంగా పటకలు తీయడం వల్ల అక్కడ ఉండే లిగమెంట్లు శాశ్వతంగా సాగిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన మెడ నొప్పులు, కండరాల పట్టేయడం, ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తుతాయి.
బార్బర్ షాప్‌కు వెళ్లినప్పుడు మీ జుట్టును మాత్రమే కట్ చేయించుకోండి తప్ప మెడను మసాజ్ చేయవద్దని, బలంగా తిప్పవద్దని ఖచ్చితంగా చెప్పండి. మసాజ్ తర్వాత అకస్మాత్తుగా మైకం రావడం, చూపు మసకబారడం, మాట తడబడటం, ముఖం లేదా శరీరంలో ఒకవైపు తిమ్మిరి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య చికిత్స అందించే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రాణాలను పణంగా పెట్టి అలాంటి తాత్కాలిక ఉపశమనం పొందకపోవడమే శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..