కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..? ఎక్కువ తాగితే ఏమవుతుంది..?

కిడ్నీలో రాళ్లు.. ఈ మాట వింటేనే ఆ నొప్పి గుర్తొచ్చి భయం వేస్తుంది. ఆ నరకం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అది ఎంత తీవ్రంగా ఉంటుందో. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలియగానే డాక్టర్లు మొదలుకొని పక్కింటి వారి వరకు అందరూ ఇచ్చే మొదటి ఉచిత సలహా.. నీళ్లు బాగా తాగు.. తగ్గిపోతాయి. నిజంగా నీళ్లు తాగితే తగ్గిపోతాయా..?

కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..? ఎక్కువ తాగితే ఏమవుతుంది..?
How Many Liters Of Water To Drink For Kidney Stones

Updated on: Feb 15, 2026 | 8:15 AM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, తక్కువగా నీరు తాగడం వల్ల చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు నీరే ప్రధాన పరిష్కారం అని అందరికీ తెలుసు. అయితే నీరు తాగే విషయంలో పాటించాల్సిన శాస్త్రీయ నియమాలు చాలా మందికి తెలియవు. కిడ్నీ బాధితులు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నీరు కాకుండా ఇతర ఏ డ్రింక్స్ తీసుకోవాలి? గుండె లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అనే అంశాలపై వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

నీరు కిడ్నీ రాళ్లను ఎలా నిరోధిస్తుంది?

మన మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాలు ఎక్కువైనప్పుడు అవి ఒకదానికొకటి అంటుకుని గట్టిపడి రాళ్లుగా మారుతాయి. మనం ఎక్కువగా నీరు తాగినప్పుడు మూత్రం పలుచబడుతుంది. దీనివల్ల ఆ ఖనిజాలు దగ్గరకు చేరవు. ఒకవేళ ఇప్పటికే చిన్న చిన్న రాళ్లు ఏర్పడి ఉంటే, నీటి ప్రవాహానికి అవి మూత్రం ద్వారా కరిగి బయటకు వచ్చేస్తాయి.

రోజుకు ఎన్ని లీటర్లు తాగాలి?

చాలా మంది 5-6 లీటర్ల నీరు తాగేస్తుంటారు. కానీ వైద్యుల లెక్క వేరేలా ఉంది. ఇక్కడ మనం తాగే నీటి కంటే, మన శరీరం నుండి బయటకు వచ్చే మూత్రం పరిమాణం ముఖ్యం.
రోజుకు కనీసం 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. దీని కోసం మీరు రోజుకు 3 నుండి 3.5 లీటర్ల నీరు తాగాలి. మనం తాగే నీటిలో కొంత భాగం చెమట, శ్వాస ద్వారా బయటకు పోతుంది. అందుకే ఎండలో తిరిగే వారు లేదా వ్యాయామం చేసేవారు దీనికంటే కొంచెం ఎక్కువ తాగాల్సి ఉంటుంది.

నీటితో పాటు ఇవి కూడా బెస్ట్

కేవలం మంచినీరే కాకుండా.. నిమ్మరసం, నారింజ రసం వంటివి తీసుకోవడం చాలా మంచిది. వీటిలోని సిట్రేట్ అనే పదార్థం కొత్త రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అయితే సోడాలు, కూల్ డ్రింక్స్, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

అందరూ నీళ్లు ఎక్కువగా తాగకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం..

  • గుండె జబ్బులు ఉన్నవారు
  • కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఉన్నవారు
  • కాలేయ సమస్యలు ఉన్నవారు

వీరి శరీరం ఎక్కువ నీటిని ప్రాసెస్ చేయలేదు. దీనివల్ల శరీరంలో నీరు చేరి వాపులు రావచ్చు. వీరు కచ్చితంగా డాక్టర్ సలహా మేరకే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

అతిగా తాగితే అనర్థమేనా..?

అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. 4 – 5 లీటర్ల కంటే ఎక్కువ తాగడం వల్ల కిడ్నీలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే 3-3.5 లీటర్ల పరిధిలో ఉండటమే అత్యంత సురక్షితమైన మార్గం.