
బరువు తగ్గే ప్రయత్నంలో ఆహార నియమాలు, వ్యాయామంతో పాటు నీటిని ఎలా తాగుతున్నామన్నదీ ముఖ్యంగా పరిగణించాలి. నీరు తగిన విధంగా తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరంలోని చెడు పదార్థాలు బయటకు పోతాయి శక్తి నిలిచిపోతుంది. నిద్ర లేవగానే మొదటిగా గ్లాసు నీరు తాగితే శరీరంలో రాత్రంతా పేరుకున్న చెత్త పదార్థాలు బయటకు పోతాయి. శరీరం రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. జీర్ణతంత్రం తిరిగి పని చేయటం ప్రారంభిస్తుంది. ఇది శక్తివంతమైన డిటాక్స్ మార్గంగా చెప్పొచ్చు.
ఆహారం తినే సమయానికి పావుగంట ముందు నీరు తాగడం వల్ల ఆకలి కొంత తగ్గుతుంది. తక్కువ మోతాదులో తినడం అలవాటవుతుంది. ఇది బరువు నియంత్రణలో ఉండేందుకు ఉపయోగపడుతుంది. నీరు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువ నీరు తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో తినే పదార్థాలు సరిగ్గా జీర్ణమయ్యే అవకాశం తగ్గుతుంది. అందువల్ల తినేటప్పుడు నీరు తగ్గించి ఆహారాన్ని బాగా నమలడం అవసరం. దీని వల్ల ఆహారం శరీరానికి అవసరమైన మోతాదులో మాత్రమే చేరుతుంది.
నిద్రకు దాదాపు గంట ముందే గ్లాసు నీరు తాగితే రాత్రిపూట శరీరం తేమ కోల్పోకుండా ఉంటుంది. ఇది శరీర అవయవాలు నిద్రలో సరైన విధంగా పనిచేయడానికి సహకరిస్తుంది. రాత్రిపూట ఎలక్ట్రోలైట్ స్థాయిలు స్థిరంగా ఉండటానికి ఇది అవసరం.
ఉదయం నుంచి రాత్రి దాకా ఆహార సమయాల మధ్యలో నీరు తాగడం వల్ల తేమ తగినంతగా శరీరానికి అందుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలసట తగ్గుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
వ్యాయామం చేసే ముందు కొంత నీరు తాగడం శరీర శక్తిని పెంచుతుంది. వ్యాయామ సమయంలో వచ్చిన చెమటతో శరీరం తేమ కోల్పోకుండా చూసుకోవచ్చు. ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. ఈ సాధారణ మార్గాలను అమలు చేస్తే బరువు తగ్గడం సహజంగా జరుగుతుంది. శరీర ఆరోగ్యం మెరుగవుతుంది.