
ఆరోగ్యమే మహాభాగ్యం.. మన ఆరోగ్యం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే.. గోరువెచ్చని నీరు తాగాలా? లేక చల్లటి నీరు తాగాలా? ఏది మన శరీరానికి అసలైన ప్రయోజనాన్ని అందిస్తుంది? దీనిపై ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం..
మనం రాత్రిపూట 6 నుండి 8 గంటల పాటు నిద్రపోయినప్పుడు, శరీరం ఎటువంటి ద్రవాలను తీసుకోదు. దీనివల్ల ఉదయానికి శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నిద్రలేవగానే నీరు తాగడం వల్ల శరీర అంతర్గత అవయవాలు మళ్లీ చురుగ్గా మారి, జీవక్రియలు యాక్టివేట్ అవుతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడమే అత్యుత్తమ ఎంపిక.
మెరుగైన జీర్ణక్రియ: గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను నిద్రలేపి, ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది.
డీటాక్స్: శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గుదల: గోరువెచ్చని నీరు శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి, మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది కేలరీలను కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
రక్త ప్రసరణ: ఇది రక్త నాళాలను సహజంగా విస్తరింపజేసి, రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది.
మలబద్ధక నివారణ: దీర్ఘకాలిక మలబద్ధక సమస్యతో బాధపడేవారికి గోరువెచ్చని నీరు ఒక చక్కని పరిష్కారం.
ఉదయం నిద్రలేవగానే మరీ చల్లటి నీరు తాగడం అంత మంచిది కాదు. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా గొంతు సమస్యలకు దారితీయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చల్లటి నీరు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉదయం వ్యాయామం చేసినట్లయితే, శరీరాన్ని చల్లబరచడానికి, త్వరగా రీహైడ్రేట్ అవ్వడానికి చల్లటి నీరు సహాయపడుతుంది. చల్లటి నీటిని శరీర ఉష్ణోగ్రతకు మార్చడానికి శరీరం కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది స్వల్పంగా కేలరీలను బర్న్ చేస్తుంది.
మొత్తం మీద చూస్తే.. మీ రోజును ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించడానికి గోరువెచ్చని నీరు తాగడమే ఉత్తమ మార్గం. ఇది మీ అంతర్గత వ్యవస్థలను శుభ్రపరిచి, రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది.