Heart Problems: రోజురోజుకు మనిషి ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నాడు. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరిగినా ప్రమాదమే. ఇక హైబీపీ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే మున్ముందు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న 36వేల మందిపై శాస్త్రవేత్తలు ఈ పరిశోధణ నిర్వహించారు. యుక్త వయస్సులో ఒత్తిడి, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వాటిని ఆ వయస్సులో నియంత్రించలేకపోతే భవిష్యత్తులో వారికి మరిన్ని గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
అలాగే కేవలం హైబీపీ ఎక్కువగా ఉండే వారికి దాని నియంత్రించకపోతే భవిష్యత్తులో వారి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజు వ్యాయామం చేయాలంటున్నారు. అలాగే మద్యం, ధూమపానం మానుకొని పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
చలికాలంలో జాగ్రత్త..
చలి కాలంతో గుండెకు ఎంతో సంబంధం ఉంది. చలి అంటేనే వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, బయట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు వ్యక్తి శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ‘సింపథటిక్ నర్వస్ సిస్టమ్’ వేగవంతం అవుతుంది. దాంతో గుండె స్పందన పెరుగుతుంది. అంటే, గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. రక్తనాళాలపై ఒత్తిడి అధికమై బీపీ పెరుగుతుంది. ఇవన్నీ కలిసి గుండెపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: