అశ్వగంధ ఆకులు వాడుతున్నారా? ఆయుర్వేద మూలికపై వచ్చిన కొత్త రూల్స్ గురించి తెలుసా

ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజా అడ్వైజరీ ప్రకారం, హెల్త్ సప్లిమెంట్లు, ఇతర ఆహార ఉత్పత్తులలో కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన సారాన్ని మాత్రమే వాడాలి. కొన్ని కంపెనీలు అశ్వగంధ ఆకులను కూడా పొడి రూపంలోనో లేదా ఇతర రూపాల్లోనో వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

అశ్వగంధ ఆకులు వాడుతున్నారా? ఆయుర్వేద మూలికపై వచ్చిన కొత్త రూల్స్ గురించి తెలుసా
Ashwagandha.jpg

Updated on: Apr 24, 2026 | 3:42 PM

అశ్వగంధ.. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మంచి నిద్ర కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది అశ్వగంధ సప్లిమెంట్లను వాడుతున్నారు. అయితే, పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అధికారం (FSSAI) కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. అశ్వగంధ ఉత్పత్తుల తయారీలో ఏ భాగాలను వాడాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఆకులు ఎందుకు వాడకూడదు?

అశ్వగంధ వేర్లు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుకలో ఉన్నాయి. కానీ ఆకులు, కాడలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుల్లో ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కాలేయంపై విషప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అశ్వగంధ ఆకుల వాడకంపై నిషేధం విధించింది. కంపెనీలు తమ ఉత్పత్తుల ప్యాకెట్ల మీద ఏ భాగాన్ని వాడారో స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. చాలా బ్రాండ్లు కేవలం ‘అశ్వగంధ’ అని మాత్రమే రాస్తున్నాయని, ఇది వినియోగదారులను అయోమయానికి గురిచేస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోతాదు మించితే ముప్పే!

అశ్వగంధ ఔషధ గుణాలు కలిగిన మూలిక కాబట్టి, దానిని ఆహారంలా ఎంతపడితే అంత తీసుకోకూడదు. సాధారణంగా రోజుకు 300 నుండి 600 మి.గ్రా మోతాదు మాత్రమే సురక్షితమని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఒకవేళ 1000 మి.గ్రా కంటే ఎక్కువ మోతాదు తీసుకుంటే వికారం, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు ఇతర మందులు వాడుతున్న వారు అశ్వగంధను వైద్యుల సలహా లేకుండా అస్సలు వాడకూడదు.

మీరు ఏదైనా అశ్వగంధ సప్లిమెంట్‌ను కొనేటప్పుడు అది వేర్లతో తయారైందా లేదా అనేది ఖచ్చితంగా గమనించండి. ఏ ఆరోగ్య ప్రయోజనం కోసమైనా దీనిని 8 నుండి 12 వారాల కంటే ఎక్కువ కాలం వాడకూడదు. సరైన జాగ్రత్తలు పాటించి ప్రకృతి అందించిన ఈ మూలికతో ఆరోగ్యాన్ని పదిలపరుచుకోండి.

Follow Us