AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?

రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?

Phani CH
|

Updated on: Apr 24, 2026 | 4:17 PM

Share

హైదరాబాద్‌లో రసగుల్లా తిన్న యువకుడికి తాత్కాలిక పక్షవాతం రావడం సంచలనం సృష్టించింది. ఇది 'హైపోకలేమిక్ పీరియాడిక్ పెరాలసిస్' అనే అరుదైన వ్యాధి. తీపి పదార్థాలు రక్తంలో పొటాషియం స్థాయిలను తగ్గించి, కండరాల బలహీనతకు దారితీస్తాయి. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో ఇది సాధారణం. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

“రసగుల్లా.. పేరు వింటేనే నోరూరుతుంది. ఆ తెల్లటి మెత్తని స్వీట్‌ను నోట్లో వేసుకుంటే కలిగే ఆనందమే వేరు. ఏ శుభకార్యానికైనా, పండగకైనా ఈ స్వీట్ ఉండాల్సిందే. అయితే, ఆ ఇష్టమైన స్వీటే ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరైనా ఊహిస్తారా? కేవలం ఐదు రసగుల్లాలు తిన్నందుకు, ఒక యువకుడు పక్షవాతం బారిన పడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడికి ఎదురైన ఈ వింత అనుభవం ఇప్పుడు వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అసలు స్వీట్ తింటే కాళ్లు, చేతులు ఎందుకు పడిపోయాయి? ఆ వ్యక్తికి ఏమైంది? దీని వెనుక ఉన్న ఆ ‘అరుదైన’ మెడికల్ మిస్టరీ ఏంటి? “హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల ఒక వ్యక్తికి ఇటీవల ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక రోజు రాత్రి సరదాగా ఐదారు రసగుల్లాలు తిన్నాడు. కానీ తిన్న కొద్దిసేపటికే అతని శరీరంలో మార్పు మొదలైంది. చూస్తుండగానే రెండు కాళ్లు, చేతులు ప్రాణం లేనట్టుగా పడిపోయాయి. కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఒక్కసారిగా శరీరం సహకరించకపోవడంతో తన కుటుంబం కంగారుపడిపోయింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ అతడిని పరీక్షించినప్పుడు అసలు విషయం బయటపడింది. నిజానికి గడిచిన ఆరు నెలల్లో ఆ యువకుడికి ఇలా జరగడం ఇది మూడవసారి. అంతకుముందు రెండుసార్లు కూడా పెళ్లి వేడుకల్లో స్వీట్లు తిన్నప్పుడే ఇలా జరిగింది. అప్పట్లో అది కేవలం ఫుడ్ పాయిజనింగ్ ఏమో అని భ్రమపడ్డాడు. కానీ ఈసారి వైద్య పరీక్షల్లో తేలింది ఏమిటంటే.. అది ఫుడ్ పాయిజనింగ్ కాదు, శరీరంలోని ఒక పెద్ద అనారోగ్య సమస్య వల్ల ఇలా జరిగిందని అందరికీ అర్థమైంది. “ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘హైపోకలేమిక్ పీరియాడిక్ పెరాలిసిస్’ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుందంటే మన రక్తంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు ఇలాంటి తాత్కాలిక పక్షవాతం వస్తుంది. మనం రసగుల్లా లాంటి తీపి పదార్థాలు లేదా బియ్యం, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ అతిగా విడుదలైనప్పుడు, అది రక్తంలోని పొటాషియంను కండరాల కణాల లోపలికి బలవంతంగా నెట్టేస్తుంది. దీనివల్ల రక్తంలో పొటాషియం నిల్వలు తగ్గిపోయి, కండరాలు కదల్లేని స్థితికి చేరుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆసియా దేశాల్లోని పురుషులలో ఈ సమస్య తరచుగా ‘హైపర్ థైరాయిడిజం’ వల్ల వస్తుంది. అతని విషయంలో కూడా థైరాయిడ్ సమస్యే ఈ పెరాలసిస్‌కు మూలకారణమని డాక్టర్లు గుర్తించారు.” “ఒకవేళ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. డాక్టర్ల పర్యవేక్షణలో పొటాషియంను అందించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అయితే, ఇది మళ్లీ రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఒకేసారి భారీగా తీపి పదార్థాలు లేదా పిండి పదార్థాలు (బిర్యానీ, స్వీట్లు) తినకూడదు. వ్యాయామం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకునే సమయంలో భారీ భోజనం తీసుకోకూడదు. మద్యపానానికి దూరంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకుని, సమస్య ఉంటే సరైన మందులు వాడాలి. గుర్తుంచుకోండి.. తిన్న వెంటనే కాళ్లు, చేతులు నీరసంగా అనిపిస్తే అది అలసట కాదు, మరేదో సమస్య ఉందని అనుమానించాలి. “మనం తీసుకునే ఆహారం, మన హార్మోన్లు – వీటి మధ్య సమతుల్యత దెబ్బతింటే ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం మనకు హెచ్చరికగా నిలిచింది. అందుకే నిపుణులు ఏం చెబుతున్నారంటే.. మీకు కూడా తరచుగా కండరాల బలహీనత అనిపిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పొటాషియం, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు పెద్దలు.. తిండి విషయంలో, ముఖ్యంగా తీపి పదార్థాల విషయంలో కాస్త నియంత్రణ పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

Follow Us