జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!

వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ఫ్లూ, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌, లెప్టోస్పిరోసిస్‌, స్క్రబ్‌ టైఫస్‌ వంటి అనారోగ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. అలాగే తేమతో కూడిన వాతావరణం కొన్ని శ్వాసకోశ వైరస్‌ల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో జ్వరం వచ్చిందంటే వెంటనే యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
Antibiotics For Fever

Updated on: Aug 19, 2026 | 10:03 AM

అసలు జ్వరం ఒక వ్యాధి కాదు.. శరీరంలో ఏదో ఇన్‌ఫెక్షన్‌ లేదా ఇతర సమస్య ఉందని సూచించే లక్షణం మాత్రమే. అందువల్ల జ్వరం వచ్చిందని వెంటనే యాంటీబయాటిక్స్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నిపుణురాలు డాక్టర్‌ జె కీర్తన ఏం చెబుతున్నారంటే.. వర్షాకాలంలో వచ్చే జ్వరానికి ఇన్‌ఫ్లుయెంజా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, లెప్టోస్పిరోసిస్‌, స్క్రబ్‌ టైఫస్‌ వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటి ప్రారంభ లక్షణాలు ఒకేలా కనిపించినప్పటికీ, ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన చికిత్స అవసరం. కాబట్టి జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం సరికాదు. త్వరగా కోలుకోవాలనే ఆందోళనతో చాలామంది జ్వరానికి బలమైన మందులు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుందని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే యాంటీబయాటిక్స్‌ అందుబాటులో ఉండటం, గతంలో మిగిలిపోయిన మందులను తిరిగి వాడటం కూడా ఇందుకు కారణమవుతోంది. అంతేకాదు.. జ్వరాన్నే ఒక వ్యాధిగా భావించి, దానికి ఒకే రకమైన మందు పనిచేస్తుందని అనుకోవడం కూడా యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగానికి దారితీస్తోంది.

వైరల్‌ జ్వరాలకు యాంటీబయాటిక్స్‌ పనిచేస్తాయా?

యాంటీబయాటిక్స్‌ బ్యాక్టీరియాపై పనిచేసే మందులు. వైరస్‌ల వల్ల వచ్చే ఫ్లూ, ఇతర వైరల్‌ జ్వరాలకు ఇవి ఉపయోగపడవు. డెంగ్యూ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు కూడా సాధారణంగా యాంటీబయాటిక్స్‌ అవసరం ఉండదు. అయితే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటు ప్రత్యేకంగా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్‌ అవసరం కావచ్చు. మలేరియాకు యాంటీమలేరియల్‌ మందులు అవసరం. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు కూడా ఏ బ్యాక్టీరియా కారణమైందో, వ్యాధి తీవ్రత ఎంత ఉందో, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆధారంగా సరైన యాంటీబయాటిక్‌ను వైద్యుడు నిర్ణయిస్తారు. అన్ని ఇన్‌ఫెక్షన్లకు ఒకే యాంటీబయాటిక్‌ పనిచేయదు. డాక్టర్‌ సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం వల్ల వికారం, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి దుష్ప్రభావాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

అన్నింటికంటే ముఖ్యంగా.. యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా లేదా తప్పుగా ఉపయోగించడం వల్ల యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (AMR) పెరుగుతుంది. అంటే బ్యాక్టీరియాలు మందులకు లొంగకుండా మారతాయి. భవిష్యత్తులో నిజంగా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు చికిత్స చేయడం కష్టమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా యాంటీబయాటిక్స్‌ అధికంగా, అనుచితంగా వాడటాన్ని యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌కు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంది. జ్వరం వచ్చిన వెంటనే సొంతంగా యాంటీబయాటిక్స్‌ వేసుకోకుండా ముందుగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ద్రవాలు, నీరు సమృద్ధిగా తీసుకోవాలి. జ్వరం తగ్గించేందుకు అవసరమైన మందులను కూడా వైద్యుల సూచన మేరకు ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

జ్వరం ఎంతకాలంగా ఉంది, ఇతర లక్షణాలు ఏమిటి, శారీరక పరీక్షలో ఏమి కనిపిస్తోంది, ఆ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి వంటి అంశాలను బట్టి వైద్యుడు అవసరమైన పరీక్షలను సూచిస్తారు. అవసరాన్ని బట్టి CBC, డెంగ్యూ NS1 వంటి రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. సాధారణ వైరల్‌ జ్వరాలు చాలావరకు 3 నుంచి 5 రోజుల్లో తగ్గిపోతాయి. అయితే అధిక జ్వరం 48–72 గంటలకు మించి కొనసాగితే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరంతర వాంతులు లేదా విరేచనాలు, రక్తస్రావం, తీవ్రమైన కడుపునొప్పి, గందరగోళం, తగినంత ద్రవాలు తీసుకోలేకపోవడం, మూత్రం తగ్గిపోవడం, తీవ్ర నీరసం లేదా తీవ్రమైన కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. జ్వరానికి కారణం తెలియకుండానే యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం పరిష్కారం కాదు. సరైన వ్యాధి నిర్ధారణ తర్వాత వైద్యుల సూచన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్‌ వాడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us