కరోనాకు మందిస్తానంటూ మంచిర్యాలలో దుకాణం తెరిచిన నాటు వైద్యుడు

| Edited By: Phani CH

May 27, 2021 | 9:28 AM

కరోనాకు ఆనందయ్య నాటుమందుకు బోలెడంత పబ్లిసిటీ దొరకడం, ఆకస్మికంగా ఆయన పాపులర్‌ కావడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా నాటువైద్యులు పుట్టుకొస్తున్నారు.

కరోనాకు మందిస్తానంటూ మంచిర్యాలలో దుకాణం తెరిచిన నాటు వైద్యుడు
Hebal Medicine
Follow us on

కరోనాకు ఆనందయ్య నాటుమందుకు బోలెడంత పబ్లిసిటీ దొరకడం, ఆకస్మికంగా ఆయన పాపులర్‌ కావడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా నాటువైద్యులు పుట్టుకొస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు బచ్చలి భీమయ్య కరోనాకు మందు ఇవ్వడం మొదలు పెట్టారు. మరో ఆనందయ్యగా తయారయ్యారు. పైగా ప్రభుత్వం అనుమతివ్వాలే కానీ కరోనా బాధితుడిని రెండు గంటల్లో నయం చేస్తానంటున్నారు. ఇప్పటికే మూడు వందల మంది కరోనా పేషంట్లను ఆరోగ్యవంతులుగా మార్చేశానని చెప్పుకొస్తున్నారు బచ్చలి భీమయ్య. కరోనా కంటే ఫాస్ట్‌గా ఇలాంటి వార్తలు స్ప్రెడ్‌ అవుతాయి కాబట్టి ఈ వార్త కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. బుధవారం సోషల్‌ మీడియాలో మొత్తం ఈ వార్తే వైరల్‌ అయ్యింది.

మందమర్రి పట్టణంలోని మారుతినగర్‌లో ఉంటున్న బచ్చలి భీమయ్యకు వనమూలికల వైద్య జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చిందట! తన తాత దగ్గర ఈ వైద్యం గురించి తెలుసుకున్నారట. దగ్గు, దమ్ము, ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వనమూలికలతో తయారుచేసిన మందు కరోనా పేషంట్లకు బాగా పని చేస్తుందని భీమయ్య అంటున్నారు. పైగా ఈ మందు వేసుకున్న రెండు గంటల్లోనే కరోనా మటుమాయం అవుతుందని చెబుతున్నారు. ఆనందయ్య లాగే ఈ మందుకు ఆయనేం డబ్బులు తీసుకోవడం లేదు. ఉచితంగానే ఇస్తున్నారు. భీమయ్య ఇచ్చే మందుకు గురించి పోలీసులకు తెలిసింది. ఆయన ఇచ్చే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని, రిస్క్‌ తీసుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారాన్ని అసలు నమ్మకూడదని సలహా ఇచ్చారు.

నిన్నటికి నిన్న కడప జిల్లా పులివెందులలో ఇద్దరు నాటు వైద్యులు దుకాణం తెరిచారు. కరోనా నియంత్రణకు పసరు మందు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అంతే వారి ఇంటి జనం బారులు తీరడం మొదలుపెట్టారు. కరోనా నియంత్రణకి ఉచితంగానే ఈ పసరు మందు అందిస్తున్నామని మందు తయారీదారులు చెబుతున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో 3 లక్షల మందికి పసరు మందు అందించామని… ఎవరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని చెబుతున్నారు. ఇస్తే ఇచ్చారు కానీ ఈ మందును ఏమనాలో తెలియడం లేదు. అన్నట్టు వీరిచ్చే మందు ఆయుర్వేదం కాదు. యూనానీ కాదు. వీరిచ్చే మందుపై ఎలాంటి పరిశోధనలు జరగలేదు.. ఎటువంటి శాస్త్రీయత లేదు. అంతేనా ..పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే ప్రహసనం. ఆనందయ్యను చూసి కొందరు నాటు వైద్యులు మందు తయారీ మొదలు పెట్టారు. . నందిని సుబ్రహ్మణ్యం అనే నాటు వైద్యుడు అయితే ఆల్‌రెడీ మందును పంపిణీ చేస్తున్నాడు కూడా. గోపాలపురం మండలంలోని చిట్యాల గ్రామంలో సుబ్రహ్మణ్యం ఇస్తున్న మందు కోసం జనం బారులు తీరుతున్నారు. ఈ పసరు మందును కళ్లలో కూడా వేస్తున్నాడాయన!

 

మరిన్ని ఇక్కడ చూడండి: New Medical Theory: పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్ రోగులు కాని 32 మందిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్, కారణం ఏమిటంటే ? ఆశ్చర్యపోతున్న డాక్టర్లు

నిరాధారం, అంతా కట్టుకథ ! చేతులు, కాళ్లపై మేకులా ? ఆ గాయాలు తానే చేసుకున్నాడన్న యూపీ పోలీసులు,