
“పెద్దల మాట చద్ది మూట” అనే మన పెద్దవారు అంటూ ఉంటారు. చద్దన్నం అనేది కేవలం పాత అన్నం కాదు, శాస్త్రీయంగా పులియబెట్టిన ఒక అద్భుతమైన ఆహారం. చద్దన్నం అంటే ఉదయాన్నే నీళ్లు కలిపి తినే అన్నం కాదు. అలాంటి అన్నం తింటే అనారోగ్య సమస్యలు రావొచ్చు. సరైన పద్ధతిలో చద్దన్నం తయారు చేయాలంటే, రాత్రిపూట వండి, కొద్దిగా చల్లారిన అన్నాన్ని తీసుకోవాలి. ఈ అన్నాన్ని ప్లాస్టిక్ కాకుండా గాజు, మట్టి లేదా మందపాటి స్టీల్ పాత్రలో ఉంచాలి. దానికి గోరువెచ్చగా కాచి చల్లార్చిన స్వచ్ఛమైన ఆవు లేదా గేదె పాలను పూర్తిగా పోయాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసి, గరిటెతో బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. ఉదయం నాటికి ఇది అద్భుతమైన పులిసిన పెరుగు అన్నంగా సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా పెరుగును విడిగా తోడుపెట్టి, అన్నంతో కలిపే రుచికి భిన్నంగా, ఈ పద్ధతిలో తయారైన చద్దన్నం చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: చద్దన్నంలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. పులియబెట్టడం (Fermentation) ప్రక్రియ వల్ల అన్నం మెతుకు పరిమాణం పెరిగి, పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి. ఇది జీర్ణం కావడానికి చాలా సులభం. దీనిని ఉదయం 6 గంటలకు తింటే సాయంత్రం 6 గంటల వరకు ఆకలి వేయదు.రోజంతా శక్తివంతంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు: చద్దన్నంలో విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ సి), ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణక్రియ:పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా అన్నంతో కలిసి మరింత అద్భుతమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శక్తి: అధిక క్యాలరీలతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ మారడం వల్ల స్థిరమైన శక్తిని అందిస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది.
రోగనిరోధక శక్తి: ఇందులోని మంచి బ్యాక్టీరియా శరీరంలోని చిన్నచిన్న ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గట్ హెల్త్ ఎంతో మెరుగుపడుతుంది.
శారీరక దృఢత్వం: సాధారణ ఆరోగ్యం, దృఢత్వానికి చద్దన్నం దోహదపడుతుంది.
తినే విధానం, కాంబినేషన్స్: తయారైన చద్దన్నానికి సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఫ్రెష్ అల్లం పచ్చడి లేదా ఊరమిరపకాయలు వంటివి కలిపి తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మామిడికాయ పచ్చడిలో ఉండే వెల్లుల్లి రెబ్బలతో కలిపి తింటే కలిగే ఆ రుచిని అమోఘం. చిన్నపిల్లలకు కూడా ఇది అద్భుతమైన ఆహారం అని, కొంతమంది దీనికి తాలింపు కూడా వేసుకుంటారని నిపుణులు తెలిపారు.
అయితే ఇది సాధారణ ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే, డయాబెటిస్ ఉన్నవారు గ్లూకోజ్‌కు దూరంగా ఉండాలి కాబట్టి చద్దన్నం తినకూడదు. ఆరోగ్య ప్రయోజనాల కోసం చద్దన్నం తయారీకి బ్రౌన్ రైస్ వాడటం మరింత మంచిది. పాలు, పెరుగు వంటివి పూర్తిగా ఆర్గానిక్ అయితే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఆహారాన్ని నిల్వ చేయడానికి లేదా చద్దన్నం తోడుపెట్టడానికి గాజు లేదా పింగాణీ పాత్రలు ఉత్తమమైనవి అని, ప్లాస్టిక్ పాత్రలను పూర్తిగా నివారించాలని నిపుణులు చెబుతున్నారు.
కేవలం నీరుగారిపోయిన, వాసన వచ్చే పాత అన్నాన్ని చద్దన్నంగా పరిగణించకూడదు. అలాంటి అన్నంలో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడి కడుపు నొప్పికి దారితీస్తుందని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు స్పష్టం చేశారు. సరైన పద్ధతిలో తయారుచేసిన చద్దన్నం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.