
బీట్‌రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగించే ఒక అద్భుతమైన కూరగాయ. బచ్చలికూర, పాలకూర కుటుంబానికి చెందిన ఈ దుంపల ఆకులు, గడ్డలు రెండూ ఆరోగ్యానికి మంచివే. దీని ఆకులు కాస్త చేదుగా అనిపించినా, రూట్ మాత్రం తియ్యగా ఉంటుంది. బీట్‌రూట్‌లు ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తాయి. కూరలకు వాడే తెల్లటి, పసుపు బీట్‌రూట్‌లు కూడా ఉన్నప్పటికీ, ఎర్రటి బీట్‌రూట్‌లో క్యాన్సర్‌తో పోరాడే బీటాసయనిన్ ఎక్కువగా ఉంటుంది. బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.
ప్రతి 100 గ్రాముల పచ్చి బీట్‌రూట్‌లో 36 క్యాలరీలు, 7 గ్రాముల ప్రొటీన్, 1 గ్రాము కొవ్వులు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5 గ్రాముల ఫైబర్, 380 మిల్లీగ్రాముల పొటాషియం, 150 ఎంసీజీ ఫోలేట్ ఉంటాయి. దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలోని అత్యధిక నైట్రేట్ శాతం రక్తపోటును తగ్గిస్తుంది.
1. యాంటీ క్యాన్సర్ కారకాలు: బీట్‌రూట్‌లో సమృద్ధిగా లభించే పర్పుల్ క్రిమ్సన్ రంగులో ఉండే బీటాసయనిన్ శక్తివంతమైనది. ఇది బ్లాడర్ క్యాన్సర్ లాంటి వివిధ క్యాన్సర్ల నిర్మూలనకు సహకరిస్తుంది.
2. రక్తపోటు తగ్గిస్తుంది: బీట్‌రూట్‌లో నైట్రేట్స్ లాంటి సహజ పోషకాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచివి. రక్తనాళాలను కాస్త రిలాక్స్ చేసి, రక్త సరఫరాను మెరుగుపరిచేందుకు ఇవి సాయం చేస్తాయి. ధమనుల దృఢత్వాన్ని ఇది పెంచుతుంది. రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె సమస్యలు, గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.
3. మెరుగైన వ్యాయామ ఫలితాలు: పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ డేవిడ్ వైర్ తన విజయ రహస్యం బీట్‌రూట్ జ్యూస్ అని చెప్పాక ఈ జ్యూస్ చాలా పాపులర్ అయింది. వ్యాయామం వల్ల కలిగే ఫలితాలను మెరుగుపరచడానికి, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి క్రీడాకారులు బీట్‌రూట్ జ్యూస్‌ను తమ డ్రింక్స్‌లో చేరుస్తున్నారని తాజా అధ్యయనాలు గుర్తించాయి.
4. కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది: బీట్‌రూట్ జ్యూస్ కండరాల రికవరీకి కూడా ఉపయోగపడుతుంది. కండరాలు రిలాక్స్ అయినప్పుడు బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ కండరాల కణాల్లో ఆక్సిజన్‌ను పెంచడానికి సహాయపడతాయి.
5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మన ఆహారంలో బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మనకు అవసరమైన శక్తి వస్తుంది. గ్లూటామైన్ ఎక్కువగా లభించే వాటిలో బీట్‌రూట్ ఒకటి. మన ఆరోగ్యానికి, జీర్ణక్రియ వ్యవస్థకు అమినో యాసిడ్ అత్యంత అవసరం. ఫైబర్ కూడా దీనిలో సమృద్ధిగా లభిస్తుంది. 10 అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూరగాయల్లో ఎర్రటి బీట్‌రూట్ ఒకటి.
బీట్‌రూట్ ఎర్రగా కనపడేలా చేసే బెటాలైన్ సమ్మేళనాలు అత్యధిక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. దీనివల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. వయసుతో పాటు వచ్చే జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌పై పోరాడేందుకు ఇవి సహాయపడతాయి.
కొందరికి బీట్‌రూట్ తిన్న తరువాత మూత్రం లేదా మలం ఎర్రగా లేదా గులాబీ రంగులో వస్తుంది. దీన్నే బిటూరియా అంటారు. ఇది హానికరం కాదు. అయితే, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే సహజంగా లభించే రసాయనాలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లాంటి సమస్య ఉన్నవారు ఆక్సలేట్ అందించే బీట్‌రూట్‌ను తినడం మానేయాలి. ఎందుకంటే అధిక ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు.