
సిట్రస్ పండ్లు.. నారింజ, బత్తాయి, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరానికి మంచి యాంటీఆక్సిడెంట్ లా పనిచేస్తాయి. కానీ రాత్రి పడుకునే ముందు తింటే ఎసిడిటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కడుపులో మంటగా అనిపించవచ్చు. అందుకే వీటిని నిద్రపోయే ముందు తినకూడదు.
పుచ్చకాయలో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కానీ రాత్రి సమయంలో తింటే నిద్రకు ఇబ్బంది కలగవచ్చు. మూత్రం ఎక్కువగా వస్తుంది కాబట్టి నిద్రలో లేవాల్సి వస్తుంది. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు.
అరటి పండులో కార్బోహైడ్రేట్లు, సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి. కానీ రాత్రివేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. శరీరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలంటే.. అరటి పండు వంటివి దూరంగా ఉంచడం మంచిది.
చెర్రీలలో మెలటోనిన్ ఉండటం వల్ల నిద్రకు సహాయం చేస్తాయని అనుకుంటారు. కానీ వాటిలో ఉండే చక్కెరలు కొన్నిసార్లు అరుగుదలకు సమస్యలు కలిగించవచ్చు. కడుపులో ఇబ్బంది కలగవచ్చు. అందుకే చెర్రీలను రాత్రివేళల్లో తక్కువగా తినడం మంచిది.
పైనాపిల్ తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉండటం సహజమే. కానీ ఇది కొంతమందిలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు కారణం కావచ్చు. రాత్రి పడుకునే ముందు తింటే ఇది కడుపులో ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో దీన్ని తినకపోవడం మంచిది.
ద్రాక్ష పండ్లలో సహజంగా షుగర్ ఉంటుంది. ఇవి శరీరానికి కొద్దిగా శక్తిని ఇస్తాయి. అయితే నిద్రకు ముందు వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవచ్చు. దీని వల్ల నిద్ర సరిగ్గా పట్టదు.
వేసవిలో అందరూ ఇష్టపడే మామిడి పండ్లలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరగడం, షుగర్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
ఆరోగ్యంగా జీవించాలంటే సరైన సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో తేలికగా.. త్వరగా అరిగే ఆహారాన్నే తీసుకోవడం మంచిది. పైన చెప్పిన పండ్లను ఎక్కువగా లేదా తక్కువగా తినాలన్నా.. రాత్రి పడుకునే ముందు కాకుండా కొంచెం ముందుగానే తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)