డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోతున్నారా? ఈ తప్పులు చేయొద్దు.. వైద్యుల హెచ్చరిక ఇదే

ప్రస్తుతం నడుస్తున్న బిజీ జీవితంలో ఎవరూ సరైన సమయానికి భోజనం చేయడం లేదు. నిద్ర పరిస్థితి కూడా అంతే. అయితే, రాత్రిపూట సరైన సమయానికి భోజనం చేయడం, నిద్ర పోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. భోజనానికి, నిద్రకు మధ్య అంతరం ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే జీర్ణక్రియ దెబ్బతింటుందని, నిద్ర నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు.

డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోతున్నారా? ఈ తప్పులు చేయొద్దు.. వైద్యుల హెచ్చరిక ఇదే
Dinner And Sleep

Updated on: Dec 28, 2025 | 6:31 PM

సరైన సమయంలో భోజనం చేయడం, నిద్ర పోవడం అనేది ఈ ఆధునిక యుగంలో ఎవరికీ సాధ్యం కావడం లేదు. నగరాల్లో ఉండేవారికి మాత్రం ఇది అసాధ్యమనే చెప్పాలి. ఉద్యోగాలు చేసేవారు ఆయా షిఫ్టుల్లో ఆఫీసులకు వెళ్లి.. విధులు ముగించుకుని ట్రాఫిక్ దాటుకుని ఇంటికి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. దీంతో సరైన సమయానికి భోజనం, నిద్ర అనేవి సాధ్యం కావడం లేదు.

కొన్ని కొన్నిసార్లు మొబైల్ లేదా టీవీ చూడటం వల్ల కూడా సమాయానికి భోజనం, నిద్రకు దూరమవుతున్నారు. దీంతో జీర్ణ, జీవక్రియలు దెబ్బతిని మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే సమాయానికి భోజనం చేసి, కొంత సమయం తర్వాత నిద్రకు ఉపక్రమించి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో భోజనం చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. నిద్ర గాఢంగా, ప్రశాంతంగా మారుతుంది.

పడుకునే ముందు ఎప్పుడు తినాలి?

వైద్యుల ప్రకారం.. మంచి జీర్ణక్రియ, మంచి నిద్ర కోసం, రాత్రి భోజనం నిద్రించే సమయానికి రెండు నుంచి మూడు గంటల ముందు తినాలి. ఇలా చేస్తే ఆహారం బాగా జీర్ణమవుతుంది. యాసిడ్, గ్యాస్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటే.. మీరు మీ విందును రాత్రి 7 నుంచి 8 గంటలకు ముగించాలి. మీరు రాత్రి 11 గంటలకు పడుకున్నట్లయితే.. రాత్రి 8 గంటలకు భోజనం చేయడం మంచిది. దీంతో మీరు పడుకునే సమాయానికి పొట్ట తేలికగా మారుతుంది. నిద్ర గాఢంగా పడుతుంది.

భోజనం, నిద్రకు మధ్య అంతరం ఎందుకు?

తిన్న తర్వాత శరీరం దాన్ని జీర్ణం చేసుకోవడానికి సమయం పడుతుంది. మీరు వెంటనే పడుకుంటే జీర్ణక్రియ సరిగ్గా జరగదు.
భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల కడుపులో యాసిడిటి పెరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గుండెలో మంట, పుల్లని త్రేనుపు వంటి సమస్యలను కలిగిస్తుంది.
నిద్రలో శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. పొట్ట బరువుగా ఉంటే లేదా జీర్ణక్రియ కొనసాగుతుంటే నిద్ర తరచుగా డిస్టర్బ్ అవుతుంది.
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. కొవ్వు పేరుకుపోయి, బరువు పెరిగే ప్రమాదం ఉంది.

రాత్రి పూట ఏం తినాలి? ఏం తినకూడదు?

రాత్రిపూట ఉడికించిన లేదా తేలికగా ఉండే కూరగాయలు, పప్పు, కిచిడి, రోటీ లేదా బియ్యం, కొద్దిగా వేడి చేసిన పసుపు పాలు, కొన్ని బాదం లేదా వాల్నట్లు, పెరుగు(తక్కువగా) ఆహారంగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. భారీ భోజనం, వేయించిన, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు, తీపి పదార్థాలు, స్నాక్స్, టీ, కాఫీ లాంటి కెఫిన్ పదార్థాలను, తీపి ఎక్కువగా ఉండే పండ్లను రాత్రి పూట తినకూడదు.