అప్పుడు బిల్లా-రంగా, ఇప్పుడు..నిర్భయ దోషులు..తీహార్ జైలు చరిత్రలో…

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీశారు. ఢిల్లీలోని తీహార్ జైలులో...

అప్పుడు బిల్లా-రంగా, ఇప్పుడు..నిర్భయ దోషులు..తీహార్ జైలు చరిత్రలో...
Follow us

|

Updated on: Mar 20, 2020 | 9:29 AM

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీశారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఈ నలుగురికీ అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు దోషులూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు. తన కుమార్తె హత్యకు కారకులు నలుగురికీ ఎట్టకేలకు శిక్ష అమలైంది. తన సుదీర్ఘ పోరాటంలో న్యాయం దక్కిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈ రోజును ఈ దేశంలోని అమ్మాయిలందరికీ అంకితం చేస్తున్నానన్నారు.

ఇక, నిర్భయ దోషులను కాపాడేందుకు వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ చివరి క్షణం వరకు పోరాటం చేశారు. ఉరి శిక్ష నుంచి కాపడడానికి లాయర్ ఏపీ సింగ్ చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఉరికి ముందు కూడా ఆఖరి ప్రయత్నంగా వారిని విడిపించేందుకు దోషుల తరపు లాయర్ ఏపీ. సింగ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ధర్మాసనం తలుపు తట్టారు. అయితే ఏపీ సింగ్ చెప్పిన ఏ విషయాన్ని కూడా అంగీకరించని కోర్టు చివరకు ఉరిశిక్ష ఖరారు చేయాలని చెప్పింది. ఇక ఉరిశిక్ష అమలు జరిగిన నలుగురు దోషులు కూడా ఉరికి ముందు రోజు రాత్రి వింతగా ప్రవర్తించారు. వినయ్ శర్మ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. ఇక పవన్ గుప్తా జైలు అధికారులను దూషించాడని చెబుతున్నారు.

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు మరణదండన అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీశాడు. దక్షిణాసియా లోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి.

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను.. 1949లో అంటే… దేశంలో మొదటిసారి.. ఉరి తీశారు. మళ్లీ చివరిగా అంటే.. 2015లో ముంబై వరుస పేలుళ్ళ ఘటనలో శిక్ష పడ్డ యాకూబ్ మెమన్‌ను తీహార్‌ జైల్లో ఉరి తీశారు. ఇప్పుడు నిర్భయ నిందితులు నలుగురికి కూడా తీహార్‌ జైల్లోనే ఊపిరి ఆగిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయడం ఇదే తొలిసారి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒకరికి మించి దోషులను ఒకేసారి ఉరి తీసిన సందర్భాలు అరుదు. ఒక్కసారి మాత్రమే అలాంటి సందర్భం చోటు చేసుకుంది. 1982లో బిల్లా-రంగా అనే ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులను తీహార్ జైలులోనే ఒకేసారి ఉరి తీశారు. ఆ తరువాత.. ఒకరికి మించి ఉరి తీసిన సందర్భాలు చోటు చేసుకోలేదంటున్నారు న్యాయ నిపుణులు.