రైతు చట్టాలను సవరిస్తాం, కేంద్రం, నో చెప్పిన రైతాంగం, రేపు మళ్ళీ చర్చలు

వివాదాస్పద రైతు చట్టాలను సవరిస్తామన్న కేంద్ర సూచనను అన్నదాతలు తిరస్కరించారు. వీటి రద్దును తప్ప తాము మరేదీ కోరడంలేదని వారు స్పష్టం చేశారు. మూడింటినీ సవరించేందుకు రెడీగా ఉన్నామని తాము చెప్పామని, కానీ పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని…

  • Umakanth Rao
  • Publish Date - 10:48 am, Fri, 4 December 20

వివాదాస్పద రైతు చట్టాలను సవరిస్తామన్న కేంద్ర సూచనను అన్నదాతలు తిరస్కరించారు. వీటి రద్దును తప్ప తాము మరేదీ కోరడంలేదని వారు స్పష్టం చేశారు. మూడింటినీ సవరించేందుకు రెడీగా ఉన్నామని తాము చెప్పామని, కానీ పూర్తిగా ఉపసంహరించాల్సిందేనని వారు పట్టుబట్టారని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.  అటు-చట్టాల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకొని పక్షంలో శనివారం జరిగే చర్చల్లో తాము పాల్గొనకపోవచ్చునని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగ్ మోహన్ సింగ్ తెలిపారు. ప్రభుత్వం ఆఫర్ చేసిన ఫుడ్ ను, కనీసం మంచినీటిని సైతం స్వీకరించేందుకు ఈయన నిరాకరించారు.

కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య నిన్న సుమారు 7 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితమూ తేలలేదు. శుక్రవారం ఈ సంఘాలు తమలో తాము సమావేశమై, రేపటి చర్చల్లో తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకోనున్నాయి. మరోవైపు ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో ట్రాన్స్ పోర్ట్ సంఘాలు సమావేశమై రైతుల ఆందోళనకు తమ మద్దతును ప్రకటించాయి.

కోలీవుడ్ నటుడు కార్తీ మద్దతు:

ఢిల్లీలో 8 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులకు కోలీవుడ్ నటుడు కార్తీ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాసిన ఆయన.. గజగజ వణికించే చలిలో అన్నదాతలు ఇన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్రం స్పందించలేదన్నారు. వారి డిమాండును ప్రభుత్వం సహేతుకంగా, సానుకూలంగా పరిశీలించాలన్నారు. ఒక నటుడు అన్నదాతల ఆందోళనపై స్పందించడం ఇదే మొదటిసారి.