Jana Nayagan: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న జన నాయగన్! రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

సెన్సార్ వివాదం ముగియడంతో విజయ్ నటించిన 'జన నాయకన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.6.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తొలి రోజు కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

Jana Nayagan: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న జన నాయగన్! రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ అవుతుందా?
Jana Nayagan

Updated on: Jul 19, 2026 | 8:05 PM

తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం జన నాయగన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో నెలల తరబడి కొనసాగిన సెన్సార్ వివాదం ముగియడంతో ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించింది. దీంతో జూలై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.6.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సెన్సార్ వివాదం..

వాస్తవానికి జన నాయగన్ చిత్రాన్ని 2026 పొంగల్ సందర్భంగా జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే సెన్సార్ బోర్డుతో తలెత్తిన వివాదం కారణంగా సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ఇటీవల చిత్రంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన అనంతరం CBFC ‘A’ సర్టిఫికెట్ జారీ చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు..

టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే జన నాయగన్ దేశీయ మార్కెట్లో రూ.6.7 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ వివరాల ప్రకారం.. తమిళ వెర్షన్ మాత్రమే 2,399 షోలలో 1.33 లక్షలకు పైగా టిక్కెట్లు విక్రయించి రూ.3.86 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు, హిందీ వెర్షన్ల బుకింగ్స్ కూడా క్రమంగా ఊపందుకుంటున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎంత కలెక్షన్?

అడ్వాన్స్ బుకింగ్స్‌లో కర్ణాటక ముందంజలో నిలిచింది. అక్కడ రూ.2.59 కోట్ల గ్రాస్ నమోదుకాగా, తమిళనాడులో రూ.2.47 కోట్లు, కేరళలో రూ.1.32 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో నటుడిగా ఆయన చివరి చిత్రంగా జన నాయగన్ నిలవనున్నట్లు భావిస్తున్నారు. ఈ కారణంగా అభిమానుల్లో సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. దాదాపు రెండేళ్ల తర్వాత విజయ్ సినిమా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రజనీకాంత్ రికార్డు బద్దలవుతుందా?

ప్రస్తుతం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రజనీకాంత్ నటించిన కూలీ రూ.151 కోట్ల రికార్డును కలిగి ఉంది. అంతకుముందు విజయ్ నటించిన లియో రూ.148.5 కోట్లతో ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు జన నాయగన్ ఆ రికార్డును అధిగమిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

8,000 స్క్రీన్‌లలో రిలీజ్

దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, నాసర్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెన్సార్ అనంతరం చిత్రంలో పలు మార్పులు, కొత్త సన్నివేశాలు, పాటలు చేర్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. దీంతో జూలై 23న విడుదల కానున్న జన నాయగన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us