
తెలుగు సినిమా స్వర్ణయుగపు తొలి దశాబ్దంలో, అంటే 1950, 60 మధ్య కాలంలో ఒక వెలుగు వెలిగిన నటుల్లో అమరనాథ్ ప్రముఖులు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటరత్న నందమూరి తారక రామారావు వంటి అగ్రశ్రేణి కథానాయకులు చలామణిలో ఉన్న రోజుల్లోనే, కొత్తగా చిత్రరంగ ప్రవేశం చేసి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ప్రముఖ నాటక రచయిత మానాపురం అప్పారావుకు సోదరుడు ఈయన. 1925లో వైజాగ్‌లో జన్మించిన సత్యనారాయణ పట్నాయక్, ఇంటర్ వరకు రాజమండ్రిలో విద్యాభ్యాసం చేశారు. స్కూల్ దశలోనే నటన పట్ల ఆసక్తి ఏర్పడి, టౌన్ మిడిల్ స్కూల్ హెడ్‌మాస్టర్ పెమ్మరాజు రామారావు ప్రోత్సాహంతో తొలిసారిగా తులాభారం నాటకంలో సత్యభామ వేషం వేశారు. ఆ తర్వాత గయోపాఖ్యానంలో కృష్ణుడిగా, లవకుశలో లవుడిగా నటించి ప్రశంసలు పొందారు. 13వ ఏట నిర్మాత కె.వి. సుబ్బారావు నిర్మించిన జయప్రద చిత్రంలో పురూరవ చక్రవర్తి కుమారుడి వేషం వేసి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో రాజమండ్రికి తిరిగి వచ్చి చదువు కొనసాగించారు. యోగానంద్ తన తొలి సినిమా అమ్మలక్కలు చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడి వేషం ఇచ్చి, సత్యనారాయణ పేరును అమరనాథ్‌గా మార్చారు.
“నా చెల్లెలు” చిత్రంతో హీరోగా పరిచయమైన అమరనాథ్, సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం భానుమతి సొంత చిత్రం చండీరాణిలో, ఎన్టీఆర్ సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలోనూ నటించారు. ఆదూర్తి సుబ్బారావు తొలి చిత్రం అమర సందేశం అమరనాథ్ కెరీర్‌కు పెద్ద మలుపు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఆడబిడ్డ, వదిన గారి గాజులు, సంతానం, అక్కాచెల్లెళ్లు, వరుడు కావాలి, వద్దంటే పెళ్ళి వంటి దాదాపు 20 చిత్రాల్లో హీరోగా నటించారు. కృష్ణ గారడిలో కృష్ణుడిగా, సతి అరుంధతిలో నారదుడిగా ప్రత్యేక పాత్రలు పోషించారు.
అయితే, అమరనాథ్ మహా కోపిష్టి స్వభావం, షార్ట్ టెంపరే ఆయన కెరీర్‌కు మైనస్ మైనస్ గా మారింది. నిర్మాతలు, పంపిణీదారులపై కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త హీరోల రాక కూడా ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది. దాంతో, తన భార్య పేరు మీద శ్రీ సరళ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1960లో మగవారి మాయలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణకుమారి హీరోయిన్‌గా, రాజనాల విలన్‌గా నటించగా, ఆయన రెండవ కుమార్తె శ్రీలక్ష్మి బాలనటిగా కనిపించారు. సినిమాకు మంచి ప్రచారం చేసినప్పటికీ, ఆశించిన విజయం సాధించలేదు. పంపిణీదారులైన పూర్ణా పిక్చర్స్‌పై కోర్టుకు వెళ్లడంతో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడ్డారు. సొంత సినిమా వల్ల బయటి అవకాశాలు తగ్గడంతో, ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. స్వాభిమానం కారణంగా అవకాశాలు అడగలేక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఇష్టపడలేదు. 1965 ప్రాంతాల్లో మద్రాసు నుంచి హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి మకాం మార్చారు. డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మిస్తూ కుటుంబాన్ని పోషించారు. 1972లో “బాలయోగిని” అనే చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేసినా, మిత్రులు చేయివ్వడంతో అది ఆగిపోయింది. వారసురాలు (1973) ఆయన చివరి చిత్రం. 1980 ఫిబ్రవరి 22న 55 ఏళ్ల వయసులో జాండిస్ వ్యాధితో అమరనాథ్ కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. రెండవ కుమార్తె శ్రీలక్ష్మి కే. విశ్వనాథ్ “శుభోదయం” చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం కోల్పోయి, తర్వాత హాస్యనటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కుమారుడు రాజేష్ కూడా సినిమాల్లోకి వచ్చి అకాల మరణం చెందగా, మరో కుమారుడు ఆనంద్ కూడా తండ్రిలనే జాండిస్‌తో చిన్నవయసులోనే మరణించారు. రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా కొనసాగుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.