Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..

తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాక్షి రంగారావు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, బాపు రమణల ప్రోత్సాహంతో సాక్షి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తన విభిన్నమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొంది, సాత్విక, హాస్య, విలన్ పాత్రల్లో జీవించారు. ఆయన నిబద్ధత, నిరాడంబరత ఎందరికో ఆదర్శం. ఆయన గురించి తెలుసుకుందాం.

Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..
Sakshi Ranga Rao

Updated on: Jul 07, 2026 | 10:48 PM

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు సాక్షి రంగారావు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరాడంబరమైన వ్యక్తిత్వం, వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణలు సాక్షి చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నప్పుడు, పాతికేళ్ళు కూడా నిండని ఓ యువకుడు వారి ఆఫీసుకు వచ్చాడు. చేతిలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి రాసిన సిఫార్సు లేఖ. ఆ యువకుడే రంగారావు. రావిశాస్త్రి సిఫార్సుతో, నాటక రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి, సాక్షి చిత్రంలో అవకాశం కల్పించారు బాపు-రమణలు. రంగారావు అసలు ఇంటిపేరు రంగావజ్ఝల. 1942 సెప్టెంబర్ 15న కృష్ణా జిల్లా, గుడివాడ పక్కనే ఉన్న కింది పర్రు గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణగారు చిన్నప్పుడే మరణించడంతో, తల్లి రంగనాయకమ్మ ఆధ్వర్యంలో పామర్రులో తన పెద్దమ్మ బుచ్చిరావమ్మ ఇంటి వద్ద పెరిగారు. చదువు పూర్తయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు. అక్కడే ఆయనకు నాటకాలంటే ఆసక్తి కలిగింది. ప్రముఖ రంగస్థల నటులు కుప్పిలి వెంకటేశ్వరరావు వద్ద శిష్యరికం చేసి, ఆయన ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హాస్య పాత్రలు పోషించడంలో ఆయనకు మంచి ప్రజ్ఞ ఉండేది. మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మిత్రుల ప్రోత్సాహంతో, రావిశాస్త్రి సిఫార్సు లేఖతో సినీ పరిశ్రమకు వచ్చారు.

మద్రాసు చేరుకున్న రంగారావు ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరిగా బాపు-రమణలను కలిసి సాక్షి చిత్రంలో అవకాశం పొందారు. ఈ చిత్రంలో కరణం పాత్రను అద్భుతంగా పోషించి, తన వయసుకు మించిన వేషంలో నలుగురి దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకొని సాక్షి రంగారావుగా చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. అప్పటి నుండి సాత్విక, హాస్య, విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు సాక్షి రంగారావు అంటే ఎంతో ఇష్టం. తన ప్రతి చిత్రంలోనూ ఆయనకు మంచి వేషం ఇచ్చేవారు. శంకరాభరణం సినిమాలో మృదంగం విద్వాన్ పాత్ర, స్వర్ణకమలంలో భార్య భక్తిని భరించే భర్త పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చాయి. జంధ్యాల, వంశీ వంటి దర్శకులు కూడా ఆయనకు విలక్షణమైన పాత్రలను అందించారు. రెండు రెళ్ళు ఆరు చిత్రంలో జంధ్యాల చెప్పినట్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మాట్లాడే జగపతిరావు పాత్రలో ఆయన టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో కమెడియన్‌గా రెచ్చిపోయినా, పల్లకి చిత్రంలో సెంటిమెంట్ పాత్రలో వంశీ ఆయనలోని మరో కోణాన్ని వెలికితీశారు. “పాత్ర చిన్నదా, పెద్దదా అని చూసుకోకుండా తెరపై మనం కనిపించినంత సేపు ఆడియన్స్ అటెన్షన్ మన మీదే ఉండాలి” అనేవారు సాక్షి రంగారావు.

సాక్షి రంగారావు వృత్తిపరంగా ఎంత నిబద్ధతతో ఉండేవారో, వ్యక్తిగతంగా అంతకంటే నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ఎవరినీ తనకు వేషం ఇవ్వమని అడిగేవారు కాదు. తన ప్రతిభ, మంచితనం తెలిసినవారు అవకాశాలు ఇచ్చేవారు. పారితోషికం విషయంలో డిమాండ్ చేసేవారు కాదు. మొహమాటస్తుడు, అలౌకికుడైన ఆయనలో సినీ రంగంలో కనిపించే హిపోక్రసీ ఏ మాత్రం ఉండేది కాదు. బ్లాక్ మనీ ఏనాడూ అడగలేదు. రేడియో నాటకాల ద్వారా వచ్చిన 200 రూపాయలను కూడా ఇన్కమ్ టాక్స్ లెక్కల్లో చూపించేవారు. హైదరాబాదుకు చలనచిత్ర పరిశ్రమ షిఫ్ట్ అయిన తర్వాత సాక్షి రంగారావుకి వేషాలు తగ్గాయి. అయినా, “మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి, నేను వచ్చి మా అబ్బాయి ఇంట్లో ఉంటాను, వేషం మంచిదని నేను వదులుకోను” అనేవారు. దాదాపు 500 చిత్రాల్లో నటించిన ఆయన చివరి చిత్రం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వరాభిషేకం. కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.

సాక్షి రంగారావు గారి భార్య పేరు బాలా త్రిపుర సుందరి. వీరికి ముగ్గురు పిల్లలు – ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. చిన్న కొడుకు శివ కూడా నటుడే. ఏడు గంటల కన్యాశుల్కం నాటకాన్ని యధాతథంగా ప్రదర్శించాలనే కోరిక ఆయనకు ఉండేది. అందులో గిరీశం పాత్రను ప్రాక్టీస్ చేస్తూ 2005 మే 5న గుండెపోటుతో కుప్పకూలి, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 27న తుదిశ్వాస విడిచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us