
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆయన కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఈ శుభవార్తను బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి ‘సూర్యతేజ చిలుకూరి’ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ‘జనని బండ్ల’ల వివాహా సందర్భంగా ‘పసుపు కుంకుమ కార్యక్రమం’ నిర్వహించాం’ అంటూ ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు బండ్లన్న. అందులో కాబోయే అల్లుడితో పాటు వియ్యంకుల ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు బండ్ల గణేశ్ కుటుంబానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు బండ్ల గణేష్. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు బండ్లన్న. ఆపై నిర్మాతగానూ మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, టెంపర్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు బండ్ల గణేశ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కినవే. ఆ మధ్యలో రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారాయన. కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారునిగా కొనసాగారు. పాలిటిక్స్ కారణంగా చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్లన్న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మరోసారి తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అలాగే డేగల బాబ్జీ అనే సినిమాలో హీరోగానూ కనిపించారు.
సినిమాలకు దూరంగా ఉన్నా తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు బండ్ల గణేశ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో బండ్లన్న ఓ కీలక పాత్ర పోషించునున్నట్లు తెలుస్తోంది.
Bandla Ganesh Family
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.