
ప్రముఖ నటుడు సత్యరాజ్, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కట్టప్పగా చెరగని ముద్ర వేశారు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభాస్నటించిన బాహుబలి సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రంలో కట్టప్పగా ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. సత్యరాజ్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. ఆయన 1954 అక్టోబర్ 3న కోయంబత్తూరులో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన తండ్రి సుబ్బయ్య ఒక డాక్టర్. కోయంబత్తూరులోనే బీఎస్సీ వరకు చదువుకున్న సత్యరాజ్‌కు ఎంజీ రామచంద్రన్, రాజేష్ ఖన్నా వంటి నటులంటే అపారమైన అభిమానం. వారి స్ఫూర్తితోనే ఎలాగైనా వెండితెరపై రాణించాలని ఆసక్తి పెంచుకున్నారు. అయితే, ఆయన తల్లికి మాత్రం సత్యరాజ్ సినిమా రంగంలోకి రావడం ఇష్టం లేదు. అయినా సరే, తల్లిని లెక్కచేయకుండా సత్యరాజ్ చెన్నైకి పయనమయ్యారు.
చెన్నైకి చేరుకున్న తర్వాత, అవకాశాల కోసం సత్యరాజ్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. అప్పట్లో ప్రముఖ నటుడు, సూర్య తండ్రి అయిన శివకుమార్ వద్ద సినిమా అవకాశం ఇప్పించమని ఎంతో ప్రాధేయపడ్డారట సత్యరాజ్. అయితే, శివకుమార్ తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయవద్దని, ముందు చదువు పూర్తి చేయమని సలహా ఇచ్చి పంపించేశారు. కానీ, సత్యరాజ్ పట్టుదల వదలకుండా చెన్నైలోనే ఉండి తన ప్రయత్నాలు కొనసాగించారు. కమల్ హాసన్ హీరోగా నటించిన సట్టం ఎన్ కైయిల్ చిత్రంలో విలన్ అనుచరుడిగా తొలిసారిగా తెరపై కనిపించారు. ఆ తర్వాత 1985లో కార్తీక్ రఘునాథ్ రూపొందించిన సావి చిత్రంతో సత్యరాజ్ హీరోగా పరిచయమయ్యారు. సత్యరాజ్ తన కెరీర్ ప్రారంభంలో కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు.
అనంతరం స్టార్ హీరోగా కొనసాగారు. తర్వాత క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోయారు. అప్పటినుంచి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా విజయవంతంగా రాణిస్తున్నారు. మిర్చి సినిమాలో ఆయన పాత్రకు మంచి ప్రజాదరణ లభించింది. సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో పాటు ఎంజీఆర్ అవార్డు, పెరియార్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి అనేక పురస్కారాలు లభించాయి. వ్యాపార రంగంలో కూడా సత్యరాజ్ రాణిస్తున్నారు. ఆయనకు నాగమ్మల్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, దీని ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. చెన్నైలో ఆయనకు ఐదు కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా వంటి మూడు విలాసవంతమైన కార్లు కూడా ఆయన వద్ద ఉన్నాయి. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 60 నుండి 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.