
ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీపై కొందరు హీరోయిన్లు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగు సినిమాల్లో నటించి, కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుని క్రేజ్ సొంతం చేసుకున్న వీరు ఇప్పుడు ఇదే పరిశ్రమ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. తాప్సీ, తమన్నా, పూజా హెగ్డే, జాన్వీ కపూర్, రీసెంట్ గా రాధికా ఆప్టే.. ఇలా తెలుగు సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారి హీరోయిన్ల జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఇటీవల తెలుగు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వయసు పైబడిన హీరోల సరసన నటించాల్సి రావడం, సినిమా సెట్స్‌లో ప్యాడింగ్స్ ఉపయోగించమని సూచించడం తనకు అసౌకర్యంగా అనిపించిందని రాధిక పేర్కొంది. అంతేకాకుండా స్థానిక నటీమణులకు అవకాశాలు ఇవ్వకుండా, తెల్లటి చర్మం ఉందనే కారణంతో ఉత్తరాది హీరోయిన్లను ఎంపిక చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తాజాగా ఈ కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టారాయన.
‘దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు సంపాదించుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం బాధాకరం. ప్రతి నటుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ, హక్కు ఉంటుంది. కానీ నిర్మాణాత్మక విమర్శకు, ఆశ్రయం ఇచ్చిన సినిమా పరిశ్రమను ఎంపిక చేసుకుని మరీ తక్కువ చేసి చూపే అహంకారానికి మధ్య చాలా తేడా ఉంది. తెలుగు, దక్షిణాది చిత్రసీమకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం, కథా విలువలు ఉన్నాయి. వేరే ప్రాంతం వారికి వింతగా తోచే అంశాలు మా సంస్కృతిలో చాలా సహజమైనవి కావచ్చు. గౌరవం అనేది రెండు వైపులా ఉండాలి. అవకాశాలు వచ్చినప్పుడు అనుభవించి, తర్వాత ఆ సంస్కృతిని అవమానించడం తగదు. నిర్మాణాత్మక విమర్శను ఎల్లప్పుడూ స్వాగతిస్తాం కానీ సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని కాదు. మిమ్మల్ని గౌరవించిన సినిమా పరిశ్రమను మీరూ గౌరవించండి’ అంటూ ఎస్‌కేఎన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది ఎస్కేఎన్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.