ముంబైలో నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. బాయ్‌ఫ్రెండ్ షీజన్‌తో బ్రేకప్ కారణంగానే ఆమె మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. తునిషా ఆత్మహత్య కేసులో షీజన్‌కు ముంబై కోర్టు నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించింది. షూటింగ్ సెట్ లోనే తునిషా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. తునిషాను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో షీజన్ మహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 15 రోజుల క్రితం వరకు వీళ్లిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు సన్నిహితులు తెలిపారు. షీజన్‌తో బ్రేకప్‌తో తట్టుకోలేకే తునిషా సూసైడ్ చేసుకున్నట్టు చెబుతున్నారు. మరో అమ్మాయితో షీజన్ సన్నిహితంగా మెలగడాన్ని చూసి తునిషా తట్టుకోలేకపోయిందంటున్నారు ఆమె కుటుంబసభ్యులు.
‘అలీబాబా: దాస్తాన్ ఈ కాబుల్’ షూటింగ్ సెట్‌లో షీజన్ మేకప్ రూమ్‌లో తునిషా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చోటు చేసుకొన్న సమయంలో సెట్‌లో ఉన్న 14 మంది సిబ్బందిని పోలీసులు విచారించారు. ఈ కేసును హత్య, ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు. ఘటనా స్థలంలో తమకు ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని వెల్లడించారు. షీజన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.
లవ్‌జిహాద్‌తో ఈ కేసుకు సంబంధం లేదని , బ్రేకప్‌తో మానసిక ఒత్తిడి కారణంగానే తునిషా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన తునిషా పలు చిత్రాల్లో కూడా నటించింది. కత్రినా కైఫ్, విద్యాబాలన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ‘భారత్ కా వీర్ పుత్ర’ అనే సీరియల్‌తో 13 ఏళ్లకే నటిగా మారిన తునిషా ‘చక్రవర్తి అశోక సామ్రాట్’, ‘గబ్బర్ పూన్చావాలా’, ‘ఇంటర్నెట్ వాలాలవ్’, ‘హీరో: గాయబ్ మోడ్ ఆన్’ తదితర సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. వెండితెరపైనా సందడి చేసింది. ఫితూర్’ సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించింది.