అల్లూరిగా అన్నగారు.. సినిమా ప్రారంభించాక కూడా ఎందుకు ఆగిపోయిందంటే..?

ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలనే చిరకాల వాంఛ, ఆ సినిమా నిర్మాణ ప్రయత్నాలు ఈ కథనంలో ఉన్నాయి. 1957లో ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ కోసం ఎన్టీఆర్ రికార్డు చేసిన హర హర హర మహా ఓంకార నాదాన పాట ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు. అనేక అడ్డంకుల తర్వాత కృష్ణ సినిమా తీయడం, ఎన్టీఆర్ దాన్ని అభినందించడం చారిత్రక ఘట్టం.

అల్లూరిగా అన్నగారు.. సినిమా ప్రారంభించాక కూడా ఎందుకు ఆగిపోయిందంటే..?
NTR as Alluri Seetharama Raju

Updated on: Aug 29, 2026 | 4:12 PM

చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషులను సృష్టిస్తూనే ఉంటుంది. అటువంటి మహనీయుడే అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహం, తెలుగుజాతి పౌరుషాన్ని బ్రిటిష్ పాలకులకు చవిచూపించిన మన్నెం వీరుని కథను తెరకెక్కించి, ఆ పాత్రను పోషించాలనే కోరిక నందమూరి తారకరామారావుకు తన సినీ జీవితంలో ఒక గొప్ప కలలో ఉండేది. ఈ కల నెరవేరకపోయినా, దాని కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, రికార్డు చేసిన ఒక అరుదైన పాట చరిత్రలో నిలిచిపోయాయి. ఎన్టీఆర్‌కు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలనే కోరిక 1954లో వచ్చిన అగ్గిరాముడు చిత్ర నిర్మాణ సమయంలో కలిగింది. ఆ సినిమాలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ తన బృంద సభ్యులతో కలిసి చెప్పిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ సన్నివేశం ఉంది. పదిహేను నిమిషాల పాటు సాగే ఆ బుర్రకథను వింటున్నప్పుడు ఎన్టీఆర్, భానుమతితో పాటు ప్రేక్షకులు కూడా ఉత్తేజితులయ్యేవారు. అప్పుడే అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలనే కోరిక ఎన్టీఆర్‌కు బలంగా నాటుకుంది. అప్పటికే ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి పిచ్చి పుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. తోడుదొంగలు చిత్రం నిర్మాణంలో ఉంది. ఆ తర్వాత తన తమ్ముడు త్రివిక్రమరావుతో అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం గురించి చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో, 1955లో ఆ సినిమా నిర్మాణానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. సముద్రాల, పింగళి వంటి ప్రముఖ రచయితలు అందుబాటులో ఉన్నా, సీతారామరాజు మీద విస్తృతంగా పరిశోధనలు చేసిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పడాల రామారావుకి రచనా బాధ్యతలు అప్పగించారు. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలేతో అల్లూరి గెటప్ స్కెచ్ తయారు చేయించి, ఆ ప్రకారం మేకప్ వేయించుకుని స్టిల్స్ కూడా దిగారు ఎన్టీఆర్. అందరూ బాగుందని చెప్పడంతో, జైసింహ చిత్రం తర్వాత ఈ సినిమా తీయాలని నందమూరి సోదరులు నిర్ణయించుకున్నారు.

1955 అక్టోబర్ 21న జైసింహ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బయటి చిత్రాలతో బిజీగా ఉండడంతో వెంటనే షూటింగ్ ప్రారంభించే వీలు లేకపోవడం వల్ల పడాలతో పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేయించారు. ఆ తర్వాత 1957 జనవరి 17న వాహిని స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. హర హర హర మహా ఓంకార నాదాన పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డ స్వాతంత్ర సమరాంగణాన అంటూ పడాల రామారావు రాసిన పాటను సంగీత దర్శకుడు టి.వి. రాజు సారథ్యంలో రికార్డు చేశారు. ఈ పాటను ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎం.ఎస్. రామారావు పాడారు. ఆ రోజుల్లో ఈ పాటను రికార్డు చేయడానికి 12 వేల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ త్వరలోనే చిత్ర నిర్మాణం ప్రారంభిస్తామని, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు. ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. అయితే ప్రకటించినట్లుగా విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఏవో ఆవాంతరాలు, అడ్డంకులు వచ్చాయి. స్క్రిప్ట్ మీద అనుమానాలు రావడంతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టి పాండురంగ మహత్యం షూటింగ్ ప్రారంభించారు నందమూరి సోదరులు. 1957 నవంబర్ 28న ఆ సినిమా విడుదలయ్యాక మళ్లీ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రం పనులు మొదలుపెట్టారు. సీతారామరాజు సమకాలికుడు, ముఖ్య అనుచరుడు అప్పటి పార్లమెంటు సభ్యుడు మల్లు దొర సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఈ కథలో స్త్రీ పాత్రలు ఉండవని, వాస్తవికతకు దగ్గరగా ఉండడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ మీడియాకు వివరించారు. 1959లో ఒక గ్రామఫోన్ కంపెనీ అల్లూరి సీతారామరాజు చరిత్రను ఆరు భాగాలుగా రికార్డు రూపంలో విడుదల చేసింది. ఇందులో సీతారామరాజుగా గుమ్మడి, రూథర్ ఫర్డ్‌గా జగ్గయ్య నటించారు. ఈ రికార్డులు సంచలనం సృష్టించాయి.

అనేక చర్చలు, ప్రయత్నాల తర్వాత కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. సీతారామకళ్యాణం చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యాక విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం దాదాపుగా వాయిదా పడింది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు అడిగినా, ఒక మహాకావ్యంలా ఆ చిత్రాన్ని తీయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పేవారు. 1968లో వరకట్నం, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రాలను ఒకేసారి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా, రెండవ సినిమా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత డి.ఎల్. నారాయణ ప్రకటించారు కానీ ఆర్థిక కారణాల వల్ల ఆయన తీయలేకపోయారు. ఆ స్క్రిప్ట్ హీరో కృష్ణ దగ్గరికి చేరింది. అప్పటికే అల్లూరి సీతారామరాజు చిత్రం తీయాలనే ఆలోచన కృష్ణకు ఉంది. ఎన్టీఆర్ తీస్తారేమో అని కొంతకాలం వేచి చూసిన కృష్ణ, ఆ తర్వాత తానే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌కు మనస్తాపం కలిగింది. వారిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే, సీతారామరాజు పాత్ర పోషించాలన్న కోరిక ఎన్టీఆర్ మనసులో బలంగా నాటుకుని ఉండడంతో, కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీసిన పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఆ సినిమా మీద దృష్టి సారించారు. పరుచూరి సోదరులు అప్పటికి రచయితలుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, వారికి స్క్రిప్ట్ మీద వర్క్ చేయమని చెప్పారు. వారు కృష్ణ తీసిన సినిమాను ఒకసారి చూడమని సూచించారు. ఎన్టీఆర్ అలాగే అన్నారు. కొన్ని రోజుల తర్వాత వాహిని స్టూడియోలో కృష్ణ ఎదురుపడగా, ఆయన్ని పలకరించి, కృష్ణ సినిమాను చూడాలని ఉందని, ఏర్పాటు చేయమని అడిగారు ఎన్టీఆర్. కృష్ణ ప్రింట్ తెప్పించి తన విజయకృష్ణ థియేటర్లో ఎన్టీఆర్‌కి చూపించారు. సినిమా అయ్యాక కృష్ణను కౌగలించుకుని, చాలా బ్రహ్మాండంగా తీశారు బ్రదర్, ఇంతకంటే గొప్పగా మరెవ్వరూ తీయలేరు అని అభినందించారు ఎన్టీఆర్. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్‌తో సీతారామరాజు చిత్ర నిర్మాణం విరమించుకున్నానని చెప్పారు. అయితే, ఆ పాత్ర మీద తనకున్న మక్కువను తీర్చుకోవడానికి సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో కాసేపు ఆ గెటప్‌లో కనిపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us