
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. అనంతరం అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు డార్లింగ్. ఆ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నా సలార్, కల్కి సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఓ అరడజను దాకా సినిమాలున్నాయి. ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా ప్రభాస్ సినిమాలు, అతని వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడు మీడియా ముందు మాడ్లాడుతుంటారు అతని పెద్దమ్మ శ్యామలా దేవి. అలా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ ప్రభాస్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ నటించిన చిత్రాల్లో 2 సినిమాలు అంటే తనకి అస్సలు ఇష్టం లేదన్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా శ్యామలా దేవికి అసలు నచ్చలేదట. ఇందులో ప్రభాస్ ను అనాథగా, ఎవరూ లేనట్లుగా ఒంటరిగా ఉన్నట్లు చూపించడం తనకు నచ్చలేదని శ్యామలా దేవి పేర్కొన్నారు. ఈ సినిమాలోని అమ్మా లేదు నాన్న లేడు.. ఏక్ నిరంజన్ అంటూ సాగే పాట కూడా తనకి నచ్చదని ఆమె పేర్కొన్నారు.
ఇక శ్యామలా దేవికి నచ్చని మరో ప్రభాస్ సినిమా చక్రం. సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆఖరులో ప్రభాస్ చనిపోతాడు. ఇలాంటి విషాదకరమైన సన్నివేశాల్లో తన అబ్బాయి ని చూడలేకపోయానంటున్నారు శ్యామలా దేవి. ‘చక్రం చాలా మంచి సినిమా. కానీ నాకు నచ్చదు. ఆ సినిమాలో సన్నివేశాలు చూసి భరించలేక పోయాను’ అని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. కాగా కృష్ణం రాజు సతీమణికి నచ్చని ఏక్ నిరంజన్, చక్రం సినిమాలు ప్రభాస్ అభిమానులను కూడా మెప్పించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.