
ప్రేమీ విశ్వనాథ్, కార్తీకదీపం సీరియల్‌లోని దీప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితులు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితం, వృత్తిగత ప్రయాణం, సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పిల్లలు పెద్దవారవుతున్నప్పటికీ, తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించడానికి ఆమె తల్లి సహాయం ఎంతో ఉందని తెలిపారు. పిల్లలు ప్రస్తుతం కేరళలో తన తల్లి వద్ద ఉన్నారని, తాను షూటింగ్‌ల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటానని పేర్కొన్నారు. వీడియో కాల్స్, ఫోన్ ద్వారా వారితో నిరంతరం మాట్లాడుతూ ఉంటానని అన్నారు. లా గ్రాడ్యుయేట్ కావడం వల్ల, న్యాయ వ్యవస్థపై ఆమెకు బలమైన అవగాహన ఉందని తెలిపారు.. మహిళలపై జరిగే అత్యాచారాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులలో న్యాయం ఆలస్యం అవుతుందని, కొన్నిసార్లు అసలు న్యాయమే జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తగినంత వాయిస్ లేదని, ఒక కేసు కోర్టుకు వెళితే సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతుందని, అప్పటికి బాధితుల పరిస్థితి దయనీయంగా మారుతుందని అన్నారు.
నటనతో పాటు, ఆమెకు బిజినెస్ , ప్రొడక్షన్ పై కూడా ఆసక్తి ఉంది. పరిశ్రమలో ఉండటం వల్లనే ప్రొడక్షన్ పట్ల ఈ ఆసక్తి పెరిగిందని, గతంలో తనకు అలాంటి ఆలోచన లేదని అన్నారు. తన జీవితంలో ప్రతి అంశాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రేమీ విశ్వనాథ్, పని కారణంగా కుటుంబానికి తక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందుకు తాను బాధపడినప్పటికీ, తన భర్త తనకంటే మరింత బిజీగా ఉంటారని చెప్పారు.
“నేను కేరళలో ఉంటే తను కేరళలో ఉండడు, నేను హైదరాబాద్‌లో ఉంటే తను హైదరాబాద్‌లో ఉండడు. ఇద్దరం వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటాం, ఎప్పుడో ఒకసారి కలుస్తాం” అని నవ్వుతూ చెప్పారు. ఇద్దరూ తమ వృత్తులలో బిజీగా ఉండటం వల్ల తాము సంతోషంగా ఉన్నామని ఆమె తెలియజేశారు. తన భర్త ఎక్కువగా తనతో ఉండడు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.