
తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన నటీమణుల్లో జయలలిత ఒకరు. ఎన్నో సినిమాల్లో రకాలరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు జయలలిత. తల్లి, అత్తా, వదిన ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసి మెప్పించారు ఈ సీనియర్ నటి. నటి జయలలిత సినిమాల్లో మంచి స్థానం సంపాదించుకున్నప్పటికీ వ్యక్తిగతజీవితంలో మాత్రం ఒడిదుడుకులను, కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కథానాయికగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, ఆమె ఆశించిన విధంగా హీరోయిన్ పాత్రలు దక్కలేదని అన్నారు జయలలిత. ఓ సినిమా టైంలో పాటల చిత్రీకరణ కోసం విజయ గార్డెన్స్ వెళ్ళినప్పుడు, అక్కడి నిర్మాతలు ఆమెను చూసి హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి, చివరికి ఇవ్వకపోవడంతో మద్రాస్ షిఫ్ట్ అయ్యాను అని అన్నారు.
అదే సమయంలో నానా మలయాళం మ్యాగజైన్ వారు తనను చూసి మలయాళ సినీ పరిశ్రమకు పనికొస్తుందని భావించి ఇంటర్వ్యూ తీసుకోవడంతో, మలయాళ చిత్రాలలో నటించే అవకాశం లభించిందని తెలిపారు. మలయాళంలో ఆమె నటించిన “ఉప్పు” చిత్రంలో తల్లి, కూతురు డ్యూయల్ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేరళ బెస్ట్ యాక్ట్రెస్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నారు. అనంతరం ఐ.వి. శశి ద్వారా మంచి గ్లామర్ రోల్, కమల్ హాసన్ పక్కన నటించే అవకాశం వచ్చిందని ఆనందించినా, అది విలన్ భార్య, వాంప్ తరహా పాత్రగా మారిందని జయలలిత వివరించారు. ఆ తరువాత “ఇంద్రుడు చంద్రుడు” చిత్రంలో కమల్ హాసన్ తనను రికమెండ్ చేసినా, అక్కడ కూడా వాంప్ తరహా పాత్రే దక్కిందని తెలిపారు.
అలాగే నటుడు శరత్ బాబుతో తన అనుబంధంపై మాట్లాడుతూ.. అది కేవలం మనసు బంధమని, ఆయన్ను దేవుడు తనకు మార్గదర్శకుడిగా పంపించాడని భావించానని జయలలిత పేర్కొన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఒకరి రూపాయి తినరు, ఒకరికి పెట్టరని, తన కుటుంబం వరకు చూసుకుంటారని కొనియాడారు. జయలలిత, శరత్ బాబుతో ఒక బిడ్డను కనాలనుకున్నా అని అన్నారు. అయితే శరత్ బాబు ఏదైనా ఒక విషయం గురించి సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ ఉంటారని, “లలిత ఇలా వద్దు, అలా వద్దు, మనమిద్దరం పోయాక ఆ బిడ్డను ఆస్తి కోసం ఏమైనా చేస్తారేమో” వంటి సందేహాలతో వివాహం ఆలస్యమైందని చెప్పారు. అదేవిధంగా ఇండస్ట్రీ ప్రముఖులే కొంతమంది ఆయన్ను ఆపారని కూడా ప్రస్తావించారు జయలలిత. శరత్ బాబుతో కలిసి ఎన్నో యాత్రలు చేశానని, ఆయనతో ఉన్న సమయం గంటలు గంటలు ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయనను “బావ, అయ్యప్ప” అని పిలిచేదానినని చెప్పారు. ఇరుముడి కట్టుకునేటప్పుడు అయ్యప్ప దీక్షకు సంబంధించిన మంత్రాలన్నీ ఆయనే నేర్పారని, “అయ్యప్ప తత్వమసి” అని తన ఫోన్‌లో ఆయన పేరును సేవ్ చేసుకున్నానని వెల్లడించారు. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నప్పటికీ, రుణం లేదని, భగవంతుడు పడనివ్వలేదని ఎమోష్నలైయ్యారు జయలలిత.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.