
జబర్దస్త్ నటుడు అభియన కృష్ణ అదిరే అభి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 20 ఏళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అభి. ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరోవైపు సినిమాలు చేశాడు. కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. ఇక జబర్దస్త్ లోకి వచ్చాక అభి క్రేజ్ పెరిగిపోయింది. ఓ సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ గా ఎదిగిపోయాడు. జబర్దస్త్ టాప్ కమెడియన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా అభి మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అని చెప్పవచ్చు. దిగ్రేట్ రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే తను కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడు. మొదటగా చిరంజీవ అనే ఓ సినిమాను తెరకెక్కించాడు. రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు అభి. కర్మాఖ్య పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 31న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం (జులై 23) కర్మాఖ్య సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో అదిరే అభి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
‘ ‘కర్మాఖ్య’ ట్రైలర్ మీ అంచనాలకు తగ్గట్టు ఉందని అనుకుంటున్నాను. ముందు ఈ సినిమాకు కామాఖ్య అనే టైటిల్ అనుకున్ంము. ఆ టైటిల్ తోనే ప్రమోషన్స్ కూడా నిర్వహించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మేం కర్మాఖ్య అనే టైటిల్ తో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమా అమ్మవారి ఎలిమెంట్స్ తో కూడిన ఒక క్రైం థ్రిల్లర్. మీరు ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఖచ్చితంగా థ్రిల్ కి గురవుతారు. ఈ విషయాన్ని నేను గుండెమీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్తాను. ఒకవేళ ఈ సినిమా బాగోలేదు అనే టాక్ వస్తే నేను గుండు కొట్టించుకుంటాను. ఇదేదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదు. నా కష్టం, నా సబ్జెక్టు మీద నాకున్న నమ్మకం. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు నేను ఇచ్చుకునే పనిషమెంట్ అనుకుంటాను. ఈ సినిమా హిట్ అయితే సినిమాలో పనిచేసినవాళ్లందరికి క్రెడిట్ ఇస్తాను. ఒకవేళ సినిమా పోతే ఆ క్రెడిట్ మొత్తం నాదే’ అని అభి చెప్పుకొచ్చారు.
ఇటీవల సినిమా ఈవెంట్లలో హీరోలు, దర్శకులు ఇలాగే ఛాలెంజ్ లు చేశారు. తీరా వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడడతో వారు నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అభి కామెంట్స్ పై కూడా భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి