Gudamma Katha: గుండమ్మ కథకు 60 ఏళ్లు.. షష్టిపూర్తి జరుపుకుంటున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు..

సాదాసీదా టైటిల్‌ పెడితే అభిమానులు ఊరుకోరు కదా! కానీ విజయా సంస్థ ఇదేమీ పట్టించుకోలేదు. గుండమ్మ కథ అని టైటిల్‌ పెట్టింది. సినిమాను జనరంజకం చేసింది.

Gudamma Katha: గుండమ్మ కథకు 60 ఏళ్లు.. షష్టిపూర్తి జరుపుకుంటున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు..
Gundamma Katha
Follow us
Balu

| Edited By: Rajitha Chanti

Updated on: Jun 07, 2022 | 10:54 AM

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. ఇద్దరు అగ్రనటులు. పరిశ్రమకు ఇద్దరూ రెండు కళ్లలాంటివారు. ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా టైటిల్‌ గొప్పగా ఉండాలి కదా! సాదాసీదా టైటిల్‌ పెడితే అభిమానులు ఊరుకోరు కదా! కానీ విజయా సంస్థ ఇదేమీ పట్టించుకోలేదు. గుండమ్మ కథ అని టైటిల్‌ పెట్టింది. సినిమాను జనరంజకం చేసింది. అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఇప్పటికీ అందరికీ ఆనందాన్ని పంచుతూనే ఉంది. సినిమా వచ్చి 60 ఏళ్లు అవుతుంది. 1962 జూన్‌ ఏడున సినిమా విడుదలయ్యింది. షష్టిపూర్తి చేసుకున్న ఆ సినిమా గురించి కాసిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం!

నిజానికి గుండమ్మకథ తెలుగు కథ కాదు. కన్నడంలోంచి దిగుమతి చేసుకున్నది. కన్నడలో విఠలాచార్య మనె తుంబిద హెణ్ను అనే సినిమా తీశారు. ఈ చిత్ర నిర్మాణంలో విజయా సంస్థ అధినేత బి.నాగిరెడ్డి బాగా హెల్ప్‌ చేశారు. ఆ కృతజ్ఙతతోనే తెలుగు రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య. మనె తుంబిద హెణ్ను కథ నాగిరెడ్డికి బాగా నచ్చేసింది. అందులోని పాత్ర పేరే గుండమ్మ. సాధారణంగా ఈ పేరు తెలుగువారికి ఉండదు. కన్నడిగులకే ఉంటుంది.. అయినా తెలుగులో గుండమ్మ పేరుతో సినిమా తీయడం సాహసమే! అసలు మొదట్లో ఈ టైటిల్‌ను అనుకోలేదు. కాకపోతే సినిమా నిర్మాణ సమయంలో ప్రతీ ఒక్కరు నాగిరెడ్డిని మీ గుండమ్మ కథ ఎంత వరకు వచ్చింది? అని అడిగేవారట! ఇదేదో బాగానే ఉందనుకుని ఆ పేరే పెట్టేశారు మేకర్స్‌. కన్నడ సినిమాలో గుండమ్మకు భర్త ఉన్నాడు. తెలుగులో మాత్రం గుండమ్మను విధవరాలిగా చూపించారు. మణె తుంబిద హెణ్నులో గుండమ్మ తన సవతి కూతురును పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఇది తెలుసుకున్న సవతి కూతురు మేనమామ గుండమ్మకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఆమె సొంత కూతురును ఓ జైలు పక్షికి వచ్చి పెళ్లి జరిపిస్తాడు. మొత్తంగా గుండమ్మ పాత్ర నాగిరెడ్డికి గమ్మత్తుగా అనిపించింది. అదే సమయంలో విజయా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ కుటుంబకథా చిత్రం తీయాలనే ఆలోచనతో ఉన్నారు నాగిరెడ్డి – చక్రపాణిలు. ఎలాగూ హక్కులున్నాయి కాబట్టి మనె తుంబిద హెణ్నునే రీమేక్‌ చేస్తే పోలా అని అనుకున్నారు. రచయిత డి.వి.నరసరాజుతో కథా చర్చలు మొదలు పెట్టారు. కన్నడ కథలో కొన్నిమార్పులు చేశారు. సంభాషణలు రాశారు. బి.ఎన్‌.రెడ్డిని దర్శకుడిగా అనుకున్నారు. విఠలాచార్య సినిమాను బి.ఎన్‌.రెడ్డి వంటి కళాత్మక దర్శకుడు రీమేక్‌ చేయడం బాగోదనిపించింది నాగరెడ్డికి. పుల్లయ్యను తీసుకుందామనుకున్నారు. నరసరాజు రాసిన స్క్రిప్టును పుల్లయ్యకు పంపించారు. ట్రీట్‌మెంట్‌ తనకు నచ్చలేదని, సినిమా చేయడం ఇష్టం లేదని పుల్లయ్య నిర్మోహమాటంగా చెప్పేశారు. అన్నట్టు ఇక్కడో విషయం.. నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా చక్రపాణితో ఓకే అనిపించుకున్నాకే ముందుకు వెళతారు. గుండమ్మకథ స్క్రిప్టు కూడా చక్రపాణి దగ్గరకు వెళ్లింది. పిచ్చివాళ్లతో, దివ్యాంగులతో సన్నివేశాలు నడపడం చక్రపాణికి అసలు ఇష్టం ఉండదు. అందుకే కథ ఆయనకు నచ్చలేదు. నాగిరెడ్డికి మాత్రం ఎలాగైనా సరే గుండమ్మ కథను సినిమాగా తీయాలనే పట్టుదలతో ఉన్నారు. దాంతో మరోసారి చర్చలు మొదలయ్యాయి. కన్నడ కథలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకోవాలని, మిగతాదంతా సొంతంగా రాసుకోవాలని నిర్ణయించారు. సాహిత్యంపై గట్టి పట్టు ఉన్న చక్రపాణి స్క్రిప్టు మొత్తం మార్చేశారు. షేక్‌స్పియర్‌ రాసిన టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ నుంచి కొంత ప్రేరణ పొందిన చక్రపాణి స్క్రిప్ట్‌ను మొత్తం మార్చేశారు. దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావును ఎన్నుకున్నారు. నరసరాజు, కమలాకర కామేశ్వరరావుతో చర్చలు జరిపారు. గుండమ్మ భర్త క్యారెక్టర్‌ను తెలుగులోంచి తీసేద్దామన్నారు చక్రపాణి. గుండమ్మ ముత్తయిదువుగా చూపిస్తే పట్టుచీరలు, నగలు వేసి దర్పంగా చూపించవచ్చు కదా అన్నది కామేశ్వరరావు భావన. పెళ్లానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఆ పాత్ర మనకు అనవసరం అని చక్రపాణి చెప్పేశారు. హీరోలుగా ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌లను తీసుకోవాలనుకున్నారు. గుండమ్మ ఇంటి సెట్‌ను విజయవారి స్టూడియోలోనే వేశారు. సినిమాలో ఉన్నవారంతా లబ్దప్రతిష్టులే కావడంతో కాల్షీట్లు సర్దుబాటు అయ్యేవి కావు. ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే చిత్రీకరణ చేస్తూ వచ్చారు. సినిమాలోని కోలో కోలోయన్న పాటను ఎన్టీఆర్‌, సావిత్రి, ఎఎన్‌ఆర్‌, జమున కలిసి పాడుతున్నట్టే ఉంటుంది కానీ నలుగురూ కలిసి షూటింగ్‌లో పాల్గొనలేదు. ఏ జంట దొరికితే ఆ జంటతోనే చిత్రీకరణ చేశారు. ఎడిటింగ్‌లో తేడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

సినిమాల్లో మెసేజులు గట్రాలు ఇవ్వడం చక్రపాణికి సుతరామూ ఇష్టం ఉండదు. వినోదం కోసమే సినిమాలు తీస్తామని చెప్పేవారు. గుండమ్మ కథ చిత్రీకరణ టైమ్‌లో ఒకాయన చక్రపాణి దగ్గరకు వచ్చి ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్‌ ఇవ్వదల్చుకున్నారు? అని అడిగాడట! మెసేజ్‌ ఇవ్వడానికి సినిమా తీయడం ఎందుకండి? టెలిగ్రామ్‌ ఇస్తే సరిపోతుంది కదా! అని సమాధానం ఇచ్చారట చక్రపాణి. అలాగే సినిమాలో ఎల్‌.విజయలక్ష్మీ డాన్స్‌ ఉంటుంది. ఇందులో హర్‌నాథ్‌కు జోడిగా నటించిందామె! సినిమాతో సంబంధం లేకపోయినా ఎల్‌ విజయలక్ష్మితో ఓ నృత్య సన్నివేశాన్ని చిత్రించారు. ఓ సినిమా వ్యక్తి చక్రపాణి దగ్గరకు వచ్చి విజయలక్ష్మి డాన్స్‌ ఎందుకండి? అని అడిగాడట! చూడ్డానికి అని టక్కున జవాబిచ్చారట చక్రపాణి.

గుండమ్మ కథ షూటింగ్‌ ఏడాది పాటు సాగింది. సినిమాపై పరిశ్రమలో చాలా ఆసక్తి ఉండింది. విడుదలకు పది రోజుల ముందు ఎల్వీ ప్రసాద్‌ ఇంట్లో జరిగిన ఓ వివాహవేడుకలో అతిథుల కోసం ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించారు. దాంతో సినిమా టాక్‌ మొదలయ్యింది. కథ ఏమీ లేదని, సూర్యకాంతంలో గయ్యాలితనం సరిగ్గా చూపించలేదని, బలమైన సన్నివేశాలు లేవని, సినిమా ఫ్లాప్‌ అని ఇలా రకరకాలుగా నెగటివ్‌ కామెంట్లు వచ్చాయి. దర్శక నిర్మాతలకు మాత్రం చిత్రంపై పూర్తి నమ్మకం ఉండింది. ఇక్కడో విషయం చెప్పాలి. సినిమా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డికి కూడా నచ్చలేదట. ప్రివ్యూ తర్వాత నరసరాజుతో తన అభిప్రాయాన్ని చెప్పారట. ఇదేం కథండి..? కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మ సామాజికవర్గం వారి కథలా ఉంది. ఇలాంటి కథలు చక్రపాణి మాత్రమే రాయగలరు. మీ డైలాగ్స్‌ బాగున్నాయనుకోండి. కాని డైలాగ్స్‌తోనే సినిమా నడుస్తుందా ఏమిటి? అని పెదవి విరిచారట కె.వి.రెడ్డి. సినిమా హిట్‌ టాక్‌ వచ్చాక కూడా విజయావారి సినిమా, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. కాబట్టే మొదట్లో హౌస్‌ఫుల్‌ అవుతోంది. నాలుగు వారారాలయ్యాక చూద్దాం అని అనేవారట! వంద రోజుల తర్వాత కూడా జనం సినిమాను ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదండి అని వాపోయారట.

Gundamma Katha 1

Gundamma Katha 1

ఎవరెన్ని కామెంట్లు చేసినా చక్రపాణికి మాత్రం కాన్ఫిడెన్స్‌ ఉండింది. అందుకు కారణం సినిమాలో రామారావు చాలా సేపు నిక్కర్‌ మీదే కనిపిస్తారు. ప్రివ్యూ అప్పుడు రామారావును చూసి పిల్లలంతా పడీ పడీ నవ్వారట! అప్పుడే అనుకున్నారట సినిమా సూపర్‌హిట్టని..!గుండమ్మకథ విడుదలైన తర్వాత చక్రపాణి ఓ కథ రాశారు. దానిపేరు గుండమ్మ కూతుళ్ల కథ. భారతి పత్రికలో వచ్చిందా కథ. ఇందులో గంటయ్య గుండమ్మ కూతుళ్ల మధ్య గొడవలు పెడతాడు. ఇంచుమించు ఇదే కథలో ఎన్టీఆర్‌, కృష్ణలతో వయ్యారిభామలు వగలమారి భర్తలు చిత్రం వచ్చింది.