
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్ల నుంచి తరచూ వచ్చే మాట ఇది. అయితే ఇప్పుడు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న శ్రీలీల ఇటీవలే మెడిసిన్ పట్టా అందుకున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం 3’ నటి శ్రద్ధా గోకుల్ కూడా ఇదే జాబితాలోకి వస్తోంది. ఈ సినిమాలో నర్సుగా నటించిన ఈ బ్యూటీ నిజ జీవితంలో ఏకంగా డాక్టరమ్మ కావడం విశేషం. చాలా మంది హీరోయిన్ల లాగే శ్రద్ధా కూడా చిన్నతనంలోనే కెమెరా ముందుకు వచ్చింది. ఛైల్డ్ ఆర్టిస్టు గా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా ‘హలో కుట్టిచేతన్’ అనే సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధా. దీని కంటే ముందే సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే డ్యాన్స్ షో రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసిందీ క్యూటీ. సీరియల్స్ లో సక్సెస్ అవ్వడంతో సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది శ్రద్ధా. అయితే కేవలం ఒకటి, రెండు సినిమాలకే పరిమితమైంది. అందులోనూ చదువును నిర్లక్ష్యం చేయకూడదనుకుంది. దీంతో యాక్టింగ్ కు బ్రేక్ చెప్పేసి పూర్తిగా చదువుపైనే దృష్టి సారించింది.
ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ పూర్తి చేసిన శ్రద్ధా కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. అయితే ఇక్కడే ఆమె లైఫ్ టర్న్ తీసుకుంది. అసలు తను మళ్లీ సినిమాల్లోకి రావాలనుకోలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో జరిగిన ఓ ఆడిషన్ కు హాజరైంది. అక్కడ సెలెక్ట్ కావడంతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తన ‘వళతు వశతె కల్లాన్’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో శ్రద్ధా పోషించింది చిన్న పాత్రే అయినా బాగా క్రేజ్ వచ్చింది. దీంతో జీతూ జోసెఫ్ తన తర్వాతి సినిమా దృశ్యంలోనూ శ్రద్ధాకు ఓ నర్స్ రోల్ ఇచ్చాడు.
ఓ సందర్భలో తన కెరీర్ గురించి మాట్లాడిన శ్రద్ధా.. ‘ యాక్టింగ్, మెడిసిన్.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలని ఉంది. ఇందు కోసం ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్, యాక్టింగ్ రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే ఇలాగే సినిమాలు కంటిన్యూ చేస్తాను’ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.