
అలనాటి అందాల తారల్లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో జయంతి ఒకరు. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్రసీమ రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అప్పట్లో కన్నడ చిత్రసీమ రంగంలో దేవుడు రాజ్ కుమార్ అంటే, దేవత జయంతి గారు అని చెప్తూ ఉండేవారు. ఓ నటీమణిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటిగా గుర్తింపు పొందారు. సెంటిమెంట్ పండించాలి అంటే జయంతి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా సహజ సిద్ధమైన నటనతో పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోసిన గొప్ప నటీమణి ఆమె. తన పన్నెండేళ్ల వయసులో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన జయంతి , ఒక సినిమా షూటింగ్ వద్ద తాను ఎంతగానో ఇష్టపడే గొప్ప నటుడు ఎన్టీఆర్ గారిని చూశారట. ఆవిడని చూసిన ఎన్టీఆర్ దగ్గరకు పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని “నాతో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తావా?” అని అడిగారట. ఏమీ తెలియని వయసులో సిగ్గుపడుతూ వెళ్లిపోయిన ఆ అమ్మాయి, కట్ చేస్తే అదే ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో నటించి అందరినీ అలరించింది
జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి చిత్రాలలో ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. కన్నడలో ఎన్నో సినిమాలలో నటించి అప్పట్లోనే గొప్ప నటుడైన రాజ్ కుమార్ కి గట్టి పోటీని ఇచ్చిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె చిత్రసీమ రంగంలో ఆ రోజుల్లోనే ఏమాత్రం మొహమాటం లేకుండా బికినీలో నటించి ఒక ట్రెండ్ సృష్టించిన బోల్డ్ ఆక్ట్రెస్‌గా కూడా ప్రసిద్ధి చెందారు. జయంతి సినీ జీవితం సక్సెస్ఫుల్‌గా సాగినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం ముఖ్యంగా వైవాహిక జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కొనసాగింది. హీరోయిన్‌గా రాణిస్తున్న రోజుల్లోనే అప్పటి నటుడు డైరెక్టర్ అయిన పెకెటి శివరామ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టారు. కొడుకు పుట్టిన కొన్నాళ్లకి మనస్పర్థలతో భర్తతో విడాకులు తీసుకున్నారు.
సినీ జీవితంలో సక్సెస్ఫుల్ హీరోయిన్‌గా రాణించినా, జయంతి వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ కష్టాలుగానే మిగిలాయి. కొడుకు పుట్టిన తర్వాత పెకెటి శివరామ్‌తో విడాకులు తీసుకుని తర్వాత నిర్మాత అయిన బండారు గిరిబాబును పెళ్లి చేసుకున్నారు. ఈ రెండో పెళ్లి కూడా ఆమెకు అచ్చిరాలేదు. దురదృష్టవశాత్తు, ఆమె రెండో పెళ్లి చేసుకున్న గిరిబాబుతో కూడా సరిగ్గా కుదరకపోవడం, మనస్పర్థల కారణంగా అతడితో కూడా విడాకులు తీసుకున్నారు. ఇక మళ్ళీ కన్నడ చిత్రసీమ రంగంలో వరుసగా సినిమాలలో నటిస్తూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంటూ సపోర్టింగ్ ఆక్ట్రెస్‌గా రాణిస్తున్న ఆవిడ కన్నడలోనే అప్పుడే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎం.ఎస్. రాజశేఖర్ అనే అతడిని మూడో పెళ్లి చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే, ఎం.ఎస్. రాజశేఖర్ కి, జయంతికి వయసు తేడా దాదాపు పాతికేళ్లు. తనకన్నా పాతికేళ్లు చిన్నవాడు అయిన ఆ నటుడిని పెళ్లి చేసుకుని అతడికి హీరోగా లైఫ్ ఇవ్వాలనుకున్నారు. కానీ అనుకున్నవన్నీ తారుమారు అయిపోయాయి. మూడో పెళ్లి చేసుకున్నా అది కూడా కలిసిరాకపోవడంతో అతడితో కూడా విడాకులు తీసుకుని జయంతి చివరి జీవితాన్ని అంతా ఒంటరిగా నెట్టుకొచ్చారు. వెండితెర మీద విభిన్నమైన పాత్రలతో అత్యుత్తమ నటిగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ, ఆమె వైవాహిక జీవితం, ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో అన్ని ఒడిదుడుకులే, ఎన్నో కష్టాలు పడింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.