కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జులై 4 వరకు ఆయన పరప్పన అగ్రహారం జైలులో ఉండనున్నారు. ఈ కేసులో దర్శన్ A2 గా ఉండగా,
ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 నిందితురాలిగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని ఆయనను పరీక్షించిన వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలో దర్శన్ పలు సార్లు, పలువురితో గొడవలకు దిగాడు. సినిమా షూటింగుల్లోనూ ఇతరులను కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక చెబుతున్నారు.
దర్శన్ కు చిన్నచిన్న విషయాలకు కూడా అతిగా స్పందించే అలాటు ఉందని, పట్టరాని కోపం తో ఇతరులపై చేయి చేసుకునే వాడని వైద్యులు చెబుతున్నారు. అయితే అతని స్టార్ డమ్, క్రేజ్ కారణంగా ఇవన్నీ పక్కకు వెళ్లిపోయాయంటున్నారు. దర్శన్ కు కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. అయితే మరోవైపు బెయిల్ కోసమే దర్శన్ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగోలేదనే ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.