
చిరంజీవి కెరీర్‌లో అత్యంత కీలకమైన, ఆయన్ను పూర్తిస్థాయి స్టార్‌గా నిలబెట్టిన చిత్రాలలో చట్టానికి కళ్ళు లేవు ఒకటి. 1981లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించి, చిరంజీవికి తిరుగులేని ఇమేజ్‌ను అందించింది. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన సట్టము ఒరు ఇరుట్టరై చిత్రానికి రీమేక్. తమిళ వెర్షన్‌లో హీరోగా నటించిన విజయకాంత్ ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు. సట్టము ఒరు ఇరుట్టరై చిత్రానికి కథకుడు, దర్శకుడు మరెవరో కాదు, ప్రస్తుత తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్. ఆయన ఈ కథతో 20 మంది నిర్మాతలను కలిసినప్పటికీ, అందరూ కథ బాగోలేదని రిజెక్ట్ చేశారు. అయితే, నిర్మాత చిదంబరం సినిమా తీయడానికి ముందుకు వచ్చి, చంద్రశేఖర్‌కు దర్శకుడిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు. కసితో పనిచేసిన చంద్రశేఖర్ తమిళంలో పెద్ద విజయం సాధించారు. ఈ చిత్రం కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులు చట్టానికి దొరక్కుండా సంఘంలో పెద్దమనుషులుగా చలామణి అవుతుండటాన్ని చూసి రగిలిపోయిన కొడుకు, మూడో కంటికి తెలియకుండా వారిని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు, అతని అక్క పోలీస్ ఆఫీసర్. చట్టం కళ్ళు కప్పి ఏ నిందితుడు శాశ్వతంగా తప్పించుకోలేడని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించేవారెవరూ శిక్ష పడకుండా తప్పించుకోలేరని ఆమె నమ్ముతుంది. హంతకులను శిక్షించాలనే వీరి గమ్యం ఒక్కటే అయినా, మార్గాలు వేరు. అక్కా తమ్ముళ్ళు బద్ధశత్రువులుగా మారిపోతారు. చిరంజీవి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే విజయ్ పాత్రలో నటించగా, అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించే ఇన్‌స్పెక్టర్ దుర్గ పాత్రలో లక్ష్మి నటించి అద్భుతమైన సన్నివేశాలు పండించారు. మాధవి క్లబ్ డ్యాన్సర్‌గా కీలక పాత్రలో నటించారు. చిరంజీవి-మాధవి జంటగా నటించిన రెండవ చిత్రం ఇది.
ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిరంజీవి తొలిసారిగా స్టార్‌గా లభించే ప్రత్యేక హోదాను చవిచూశారు. ముంబై నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ కుచిన్స్‌ను ప్రత్యేకంగా పిలిపించి చిరంజీవి దుస్తులు కుట్టించడం అప్పట్లో ఒక విశేషం. మల్లెపువ్వు చిత్రం తర్వాత లక్ష్మి తెలుగులో నటించిన సినిమా ఇదే. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమెకు మళ్ళీ మంచి పాత్ర లభించడంతో ఈ చిత్రంలో నటించారు. తొలిసారిగా ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు సొంత సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేసిన వంకినేని సత్యనారాయణ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. అట్లూరి పూర్ణచంద్ర రావు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1981 జూన్ 27న ఏవియం స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హీరో కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో హీరో శోభన్ బాబు తొలి క్లాప్ ఇచ్చారు. కేవలం 27 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసిన కృష్ణ-చక్ర, చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. సినిమాలోని నాలుగు పాటలను మైలవరపు గోపి రాయగా, కృష్ణ-చక్ర మెలోడీ ట్యూన్స్‌తో వాటిని స్వరపరిచారు. ముఖ్యంగా “చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ” పాట బాగా పాపులర్ అయ్యింది. చట్టానికి కళ్ళు లేవు చిత్రం 1981 అక్టోబర్ 30న విడుదలై ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రం 106 రోజులు ఆడింది. ఆ థియేటర్‌లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే కావడంతో థియేటర్ యజమాని చంద్రయ్య అభ్యర్థనపై అక్కడే 100 రోజుల వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటభూషణ శోభన్ బాబు, నిర్మాత పూర్ణచంద్ర రావుకు సన్నిహితుడు కావడంతో చిత్ర ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు. ఈ సభలో శోభన్ బాబు “మొదట ఎన్టీఆర్, ఏఎన్నార్. తర్వాత నేను, కృష్ణ. భవిష్యత్తు మాత్రం చిరంజీవిదే” అని చిరంజీవి భవిష్యత్తు స్టార్‌డమ్‌ను అంచనా వేశారు. ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని కాంబినేషన్‌లో అంధా కానూన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు.