
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అలితో సరదాగా కార్యక్రమంలో తన సినీ ప్రస్థానంలోని ఎన్నో మధుర జ్ఞాపకాలను, ముఖ్యంగా వివాహ భోజనంబు సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన అనూహ్య సంఘటనలను పంచుకున్నారు. దర్శకుడు జంధ్యాల గారితో తన అనుబంధం గురించి, ఆయన దర్శకత్వ శైలి గురించి బ్రహ్మానందం విశేషంగా వివరించారు. జంధ్యాల గారిలో ఉన్న హాస్యాన్ని పండించే నైపుణ్యాన్ని కొనియాడారు. వివాహ భోజనంబు సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక సన్నివేశంలో బ్రహ్మానందం ఇసుకలో కూరుకుపోయి నటించాల్సి ట్ వచ్చిందట. సముద్రం ఒడ్డున నడుస్తున్నప్పుడు జంధ్యాల గారికి ఈ ఆలోచన వచ్చిందని, ఇసుకలో మెడ వరకు పూడ్చివేయబడిన బ్రహ్మానందం చేతులు, కాళ్లు కదపడానికి వీలులేకుండా, కేవలం తల మాత్రమే బయట ఉండిందని వివరించారు. ఆ సమయంలో ఆయన “హైదరాబాద్, సికింద్రరా బాదు” అంటూ డైలాగ్ చెబుతుంటే, చూసేవాళ్ళంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారని బ్రహ్మానందం తెలిపారు.
తాను లోపల పడుతున్న ఇబ్బంది ఎవరికీ తెలియదని, బయట నుండి నవ్వుకునేవారికి నటుడి జీవితం అర్థం కాదని హాస్యం వెనుక ఉన్న వాస్తవాన్ని వివరించారు. ఈ సన్నివేశం జరుగుతుండగానే, ఒక చిన్న కుక్క బ్రహ్మానందం వైపు రావడంతో ఆయనకు భయం పట్టుకుందట. “కుక్క వచ్చి నాపై కాలు ఎత్తుతుందేమో” అని ఆయన ఆందోళన చెందారట. ఆ పరిస్థితిని ఎవరికీ చెప్పలేక, తనలో తనే మదనపడ్డారని తెలిపారు. బ్రహ్మానందం కష్టాన్ని అర్థం చేసుకున్న జంధ్యాల గారు వెంటనే స్పందించి, “మహాప్రభో, కుక్కొచ్చి కాలెత్తినా.. ఇంకేదో చేసినా చెప్పుకునే పరిస్థితి నాకు లేదు మహాప్రభో. నన్ను వదిలిపెట్టండి” అంటూ ఒక డైలాగ్‌ను అక్కడికక్కడే రాసి, బ్రహ్మానందంతో చెప్పించారని పేర్కొన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత, యూనిట్ మొత్తం వెళ్ళిపోగా, ఇసుకలో ఉన్న తనను అక్కడి జనం వచ్చి బయటకు తీశారని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు.
తన సినీ జీవితంలో 1254 సినిమాలలో నటించానని బ్రహ్మానందం తెలిపారు. సినిమాలంటే తనకు చిన్న భయం ఉండేదని, దీనికి తన బాల్య అనుభవాలు కారణమని వివరించారు. చిన్నతనంలో తన తండ్రి మహానుభావుడని, తాము సెకండ్ షోకి వెళ్ళామంటే ఇంటికి వచ్చాక దెబ్బలు ఖాయమని, అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్లమని పంచుకున్నారు. ఈ అనుభవాల వల్ల తాను నటించిన సినిమాలను థియేటర్లలో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించనని, విమర్శలు, ప్రశంసలు పట్టించుకోకుండా మంచి సినిమా బాగుంది అంటే చూడటమే తనకు ఇష్టమని తెలిపారు. పూజ్యులు కీర్తిశేషులు కన్నెగంటి నాగలింగాచారి గారు( బ్రహ్మానందం తండ్రి) తనకు సినిమాలపై ఆసక్తిని పెంచారని బ్రహ్మానందం పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.