
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. గత కొన్ని దశబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తోన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కాదని విజయ్ టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది. తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లలో గెలవాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ 111+ సీట్లల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే 60 సీట్లకే పరిమితమైంది. అన్నాడీఎంకే కూడా 6ం+కు పైగా స్థానాల్లో లీడింగ్ తో రెండో స్థానంలో ఉంది. ఇక విజయ్ పోటీ చేసిన రెండు స్థానాలైన పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ లీడింగ్ లో ఉన్నారు టీవీకే అధినేత. కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఖాయం. అలాగే విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కూడా లాంఛనమే. ఈ నేపథ్యంలో విజయ్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సమయంలో టీవీకే విజయ్ సమర్పించిన నామినేషన్ ప్రకారం.. ఆయనకు రూ. 404.58 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి. అలాగే విజయ్ స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. భార్య సంగీతకు రూ. 15.51 కోట్ల చరాస్తులు (3,132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు), రూ. 2.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక విజయ్ వద్ద రూ. 2 లక్షలు, సంగీత వద్ద రూ. 1 లక్ష నగదు ఉంది.
విజయ్ తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా అఫిడవిట్లో వెల్లడించారు. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు. తల్లి శోభకు రూ. 87.12 లక్షలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక భార్య సంగీతకు రూ. 12.6 కోట్లు. కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు విజయ్.
కాగా గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు విజయ్. కానీ ఆయన రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. కరూర్ లో నిర్వహించిన సభలో ఏకంగా 40మందికి పైగా చనిపోయారు. ఈ ఘటన విషయంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, హీరోయిన్ త్రిషతో ప్రేమాయణం.. ఇలా ఇంటా బయటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విజయ్. అయినా అన్నిటినీ అధిగమించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కింగ్ గా అవతరించారు విజయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.