
కొంతకాలంగా ప్రేమ, డేటింగ్ రూమర్లతో వార్తల్లో నిలిచిన అనుపమ, ధ్రువ్ జంట మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, అందుకే అనుపమ ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అనుమతులూ లేకుండా, తనదైన శైలిలో స్వేచ్ఛగా బతకడం ప్రారంభించానంటూ ఆమె రాసుకొచ్చిన పోస్ట్ ఆ కామెంట్లకు బలాన్నిస్తోంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “చివరికి నా ప్రశాంతతను వెతుక్కోవడానికి కొన్ని డెడ్ ఎండ్స్ వదిలేయాల్సి వచ్చింది” అంటూ ఆమె తన మనసులో మాటను బయటపెట్టారు. కొన్నిసార్లు మనశ్శాంతి కోసం కొన్ని బంధాలను ముగించడం అవసరమని, ఈ రోజు ఆ ప్రశాంతత తనను వరించిందని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో ఆమె ఎక్కడా తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ పేరును ప్రస్తావించలేదు. అయితే, ఆమె అంతరార్థం మాత్రం స్పష్టంగా బ్రేకప్‌ను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు.
Anupama Parameswaran
తనను ఇంతకాలం ఎవరో కంట్రోల్ చేశారనే అర్థం వచ్చేలా అనుపమ చేసిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. “ఇకపై నాకు ఏది అనిపిస్తే అది చెప్తాను. దీనికోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయాలూ లేవు” అని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఫొటోలు, క్యాప్షన్లు పెట్టేముందు ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, కానీ ఆ బంధనాల నుంచి బయటకు వచ్చేశానని, ఇప్పుడు సోషల్ మీడియా పోస్టింగ్‌లు మరింత సరదాగా అనిపిస్తున్నాయని వివరించారు. ఒకప్పుడు నాది అని మరిచిపోయిన నా సొంత జీవితంతో నేను మళ్లీ ప్రేమలో పడుతున్నాను అంటూ ఆమె రాసిన కామెంట్స్ ఆలోచింపజేస్తున్నాయి.
తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘బైసన్’ అనే సినిమాలో ధ్రువ్ విక్రమ్, అనుపమ నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు కోలీవుడ్, టాలీవుడ్‌లో జోరుగా సాగాయి. వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే, తాజా పోస్ట్ అనుపమ పరమేశ్వరన్ ఇన్స్టాగ్రామ్‌లో ధ్రువ్ విక్రమ్‌ను అన్‌ఫాలో చేయడం ఈ బ్రేకప్ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది.