1988లో విజయవాడలో సినిమా థియేటర్స్ ఎందుకు తగలబెట్టారో తెలుసా..?

వంగవీటి మోహనరంగా హత్య తరువాత 1988 డిసెంబర్‌లో విజయవాడలో హింసాకాండ చెలరేగింది. రంగా అభిమానులు, మద్దతుదారులు ఆగ్రహంతో ఒక సామాజిక వర్గానికి చెందిన సినిమా థియేటర్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధ్వంసంలో అలంకార్, దుర్గా కళామందిరం, కళ్యాణ చక్రవర్తి సహా అనేక థియేటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈ సంఘటన ఆనాటి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది.

1988లో విజయవాడలో సినిమా థియేటర్స్ ఎందుకు తగలబెట్టారో తెలుసా..?
Kalyana Chakravarthy theatre in flames
Image Credit source: M.A. Mohan Rao

Updated on: May 13, 2026 | 12:26 PM

వంగవీటి మోహనరంగా పేరు తరం మారినా నేటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన ప్రభావం కలిగి ఉంది. బెజవాడ రాజకీయాలను శాసించిన రంగా, కులంతో సంబంధం లేకుండా అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సమస్యలపై నిరంతరం పోరాటం సాగించారు. వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఆనాటి బెజవాడ రాజకీయాలను ప్రభావితం చేసింది. 1988 డిసెంబర్ నెలలో గిరిపురం నివాసితులకు ఇళ్ల పట్టాల కోసం మదర్ థెరిస్సా భవన్ వద్ద తన మద్దతుదారులతో కలిసి నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగా, డిసెంబర్ 26 రాత్రి హత్యకు గురయ్యారు. ఈ ఊహించని సంఘటనతో రంగా అభిమానులు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారి ఆవేశం విధ్వంసంగా మారింది, ఒక సామాజిక వర్గానికి చెందిన ఆస్తులను, ప్రత్యేకంగా సినిమా థియేటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. విజయవాడ గాంధీనగర్‌లోని అలంకార్ థియేటర్ తీవ్రంగా నష్టపోయింది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని థియేటర్ టికెట్ల వెనుక ముద్రించడమే దీనికి కారణమని అప్పట్లో భావించారు. ఈ దాడిలో విదేశీ ప్రొజెక్టర్లు, ఖరీదైన ఫర్నీచర్, రూఫింగ్ కాలిపోయి సుమారు 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే ఇన్సూరెన్స్ కేవలం 25 లక్షల రూపాయలకే ఉండటంతో యజమాని పర్వతనేని ప్రభాస్ మిగిలిన నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమైంది.

అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న కళ్యాణ చక్రవర్తి థియేటర్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు సొంత థియేటర్ కావడంతో దీనిపై కూడా దుండగులు దాడి చేసి అగ్నికి ఆహుతి చేశారు. పొగబారిన గోడలు తప్ప మరేమీ మిగల్లేదు. గాంధీనగర్‌లోని మరో ప్రముఖ పురాతన థియేటర్ దుర్గా కళామందిరం. ఈ విధ్వంసంలో దాదాపు 40 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. థియేటర్ లోపలికి చొరబడిన దుండగులు గోడకు అతికించిన ఎన్టీఆర్ పోస్టర్లను, ఇతర సామాగ్రిని కాల్చేశారు. ఈ థియేటర్‌కు కేవలం 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. విజయ సంస్థ నిర్మించిన చిత్రాలు ఎక్కువగా ఇక్కడే ప్రదర్శితమయ్యేవి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు తమ గెస్ట్ హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడమే తాము చేసిన తప్పు అని దుర్గా కళామందిరం థియేటర్ యజమాని, పంపిణీదారుడు సి.హెచ్. హరనాథ్ బాబు అప్పట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. గవర్నర్‌పేటలోని జంట థియేటర్స్ అన్నపూర్ణ, శకుంతల కూడా ఈ దాడులకు గురయ్యాయి. డిసెంబర్ 27న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో మూడుసార్లు ఈ థియేటర్లపై దాడి జరిగింది. ఈ దాడిలో అన్నపూర్ణ పాక్షికంగా నష్టపోగా, శకుంతల థియేటర్‌కు మాత్రం భారీ నష్టం వాటిల్లింది.

బీసెంట్ రోడ్డులోని అప్సరా థియేటర్‌లోని ఫర్నీచర్ కాలిపోగా, బాలకృష్ణ నటించిన రక్తాభిషేకం రీల్స్‌ను దుండగులు ఎత్తుకుపోయారు. బెంజ్ సర్కిల్‌లోని జ్యోతి థియేటర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. వీటితో పాటు గవర్నర్‌పేటలోని లక్ష్మి, విజయ, గాంధీనగర్‌లోని శైలజ, శాంతి, జయరామ్, సితార, బందరులోని రాధికా థియేటర్, ఉయ్యూరులోని లక్ష్మీ టాకీస్ వంటి అనేక థియేటర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి చెందిన రాజ్-యువరాజ్ థియేటర్లను మాత్రం దుండగులు వదిలిపెట్టడం గమనార్హం.

సినిమా థియేటర్లే కాకుండా విజయ, సురేష్, నవయుగ, లక్ష్మీ ఫిలిమ్స్, వైజయంతి ఫిలిమ్స్, లక్ష్మీ చిత్ర వంటి పంపిణీ సంస్థల కార్యాలయాలు, ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. ఈ విధ్వంసం కొనసాగుతుండటంతో విజయవాడలో నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. థియేటర్లకు, పంపిణీ సంస్థలకు షోలు రద్దు అవ్వడం వల్ల సుమారు పాతిక కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆనాటి సంఘటన కారణంగా దెబ్బతిన్న అనేక థియేటర్లు కాలక్రమేణా పునరుద్ధరణ జరుపుకొని ప్రస్తుతం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే, ప్రతి డిసెంబర్ 27 వ తేదీ వచ్చినప్పుడు ఈ దుర్ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలు సినీ ప్రేమికుల మనసుల్లో కదలాడతాయి.

(ఈ సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించబడింది)

ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. సడెన్‌గా ప్రత్యక్షమైన వెబ్ సైట్! 
Follow Us