
బాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ యామీ గౌతమ్. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమున్న ఈ టాలెంటెడ్ నటి, హిందీలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘నయ్యి నవెల్లి’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర కథ అంతా ఒక కొత్త కోడలి చుట్టూనే తిరుగుతుంది. కార్పొరేట్ ఉద్యోగి అయిన మోహిని (యామీ గౌతమ్).. రాజా అవస్థీ (ఆదినాథ్ ఎం కోఠారే)ను వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. అయితే ఆమె ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వరుసగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో మోహిని సాధారణ మనిషి కాదని, ఆమె వెనుక ఏదో రహస్యం ఉందని, ఆమె ఓ దెయ్యం లేదా మంత్రగత్తె కావచ్చని బావమరిది బంటూ అనుమానిస్తాడు. తనపై వస్తున్న ఈ విచిత్ర ఆరోపణలను తిప్పికొడుతూ, తాను మామూలు అమ్మాయినేనని నిరూపించుకోవడానికి మోహిని చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి.
అసలు నిజం ఏంటి.? అత్తారింటికి వచ్చిన ఆ కొత్త కోడలు నిజంగానే మంత్రగత్తెనా.? లేక ఆమెపై కావాలనే ఎవరైనా నిందలు వేశారా.?ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ‘స్త్రీ’, ‘ముంజ్యా’ తరహాలో హారర్, కామెడీ అంశాలను మిక్స్ చేస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని అత్యంత వినోదాత్మకంగా మలిచారు. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే భయపెడుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ‘నయ్యి నవెల్లి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
సినిమా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లలోనే ప్రైమ్ వీడియో భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. నవంబర్ 27న రెంటల్ విధానంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 7 నుంచి ఎలాంటి అద్దె విధానం లేకుండా, ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ అందరూ ఉచితంగానే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌ను వీక్షించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.