హీరోయిన్‌పై పగబట్టిన నటుడు.. కెరీర్ నాశనం చేయడమే కాదు.. చనిపోయాక శవాన్ని కూడా వదిలిపెట్టలేదు

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అందాల తార. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. జీవితం ఓ మిస్టరీ. ఓ నటుడు ఆమె పై పగబట్టడంతో కెరీస్ నాశనం అయ్యింది. అంతే కాదు ఆమె చనిపోయిన తర్వాత శవం కూడా దొరకలేదు.

హీరోయిన్‌పై పగబట్టిన నటుడు.. కెరీర్ నాశనం చేయడమే కాదు.. చనిపోయాక శవాన్ని కూడా వదిలిపెట్టలేదు
Actress

Updated on: Mar 28, 2026 | 12:39 PM

నటశిరోమణి పసుపులేటి కన్నాంబ..  1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగులేని తెలుగు తారగా వెలుగొందారు ఆమె. నేటి తరానికి ఆమె అద్భుతమైన నటన, విశేషమైన జీవితం పరిచయం చేయదగినది. కన్నాంబ పుట్టింది 1912లో ఏలూరులో, పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబంలో, 17 మంది తోడబుట్టిన వారితో పాటు, కుటుంబంలో ఆమె ఒక్కత్తే కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో తరగతి వరకు చదువుకున్న కన్నాంబకు వీధినాటకాలు చూడటం అంటే ఎంతో ఇష్టం. నాటకాలను చూసి ఇంటికొచ్చాక ఆ డైలాగులను అనుకరిస్తూ ఇంట్లో అందరినీ నవ్వించేవారు. 11వ ఏట నాటకాలు చూడడం మొదలుపెట్టి, ఆ తర్వాత నావెల్ నాటక సమాజంలో చేరి బాలతారగా పలు చిత్రాలు చేశారు. 1935లో హరిశ్చంద్ర సినిమా ద్వారా కన్నాంబ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్రను పోషించి, తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు.

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కన్నాంబ 100కు పైగా సినిమాల్లో నటించారు. ద్రౌపదీ వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్లు వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. 30, 40వ దశకాల్లో ఆమె ఒక సంచలన నటిగా, ఆమె అందానికి ప్రేక్షకులందరూ ఫిదా అయ్యేవారు. భారీ సినిమాల్లో అవకాశాలు, పేరుతో పాటు డబ్బు కూడా ఆమెకు లభించాయి. అయినప్పటికీ, కన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పట్లో ఒక ప్రముఖ తమిళ నటుడు ఆమెకు సమస్యగా మారారు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. అయితే ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. ఆ నటుడు కన్నాంబ భర్త కడారు నాగభూషణాన్ని కూడా వదిలిపెట్టలేదు. కన్నాంబ, నాగభూషణంలు పెళ్లి చేసుకున్నాక శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించారు. వాటిలో సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం వంటి చిత్రాలు ఉన్నాయి. కన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి మారుపేరుగా ఉండేవారని చెబుతారు. అడిగిన వారికి కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్ష సంతకాలు పెట్టడం వంటివి వారికి నష్టాలను కలిగించాయి.

అవకాశాలు కోల్పోయేలా చేసిన నటుడితోనే ఒక సినిమా తీసి భారీగా నష్టపోయారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాల్లో తమ బ్యానర్‌లో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి సినిమా తీసేటప్పుడు తన స్నేహితుడి బ్యానర్ కి ఆ సినిమా ఇవ్వాలని ఆ నటుడు కోరగా, వారు అంగీకరించారు. 30 శాతం మాత్రమే చెల్లించి, మిగతా 70శాతం డబ్బు ఇవ్వకపోయినా, కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే ఆ నటుడికి రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగి, చిత్రాన్ని పూర్తి చేయకపోవడంతో వారికి మరింత నష్టం మిగిలింది. కన్నాంబ మనవడు పసుపులేటి దేవి చౌదరి గతంలో ఒకసారి మాట్లాడుతూ.. ఆ నటుడు తన అమ్మమ్మపై తీవ్రమైన పగబట్టాడని, ఆమె కెరీర్‌ను నాశనం చేయడమే కాకుండా తన తాతగారి అవకాశాలను కూడా లేకుండా చేశాడని పేర్కొన్నారు. ఆత్మబలం 1964 కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు కన్నాంబ. ఎలాంటి అనారోగ్యమూ లేకుండా, బతికున్న రోజుల్లో జ్వరం కూడా ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే, దురదృష్టవశాత్తు, మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవి చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలనేది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే, అంతలోనే శవం మాయమైంది. శరీరంపై ఉన్న నగలు కోసం దొంగలే మాయం చేశారని కొందరంటే, అది ఆ నటుడి పనే అని ఆమె మనవడు తెలిపారు. ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి, నగలన్నీ తీసేసి, శవాన్ని ఎక్కడో పారవేశారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ, ఆ శవం ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఇది కన్నాంబ జీవితంలో ఒక విషాద ఘట్టంగా, తెలుగు సినీ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us