
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్ హిట్ 2 సినిమాల్లో సైకో కిల్లర్ పాత్రలు పోషించి మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ అయితే లభించింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ చూసి మూవీ యూనిట్‌ను ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లింక్‌ను షేర్ చేసిన మహేశ్..మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటూ సినిమా నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలను ట్యాగ్ చేశారు. అలాగే సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. కాగా తన సినిమాపై మహేశ్ ట్వీట్ చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు సుహాస్. ‘అప్పుడు పోకిరి సినిమా టిక్కెట్ల కోసం వెళ్లి విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసినా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది. థాంక్యూ సో మచ్ సార్, హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అంటూ మహేశ్‌పై అభిమానం చాటుకున్నాడు.
ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్ ఒక బుక్ రైటర్ గా కనిపించబోతున్నాడు. టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. సీనియర్ నటులు రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.