
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో రెండేళ్ల క్రితం వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువత అయితే ఈ సిరీస్ ను ఎగబడి చూశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీసుల్లో ఒకటిగా రానా నాయుడు నిలిచింది. అయితే ఇందులోని కంటెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, అందులోనూ బాబాయ్ అబ్బాయ్ లు వెంకటేశ్, రానా ఇలాంటి అడల్ట్ వెబ్ సిరీస్ లో నటించడంపై అభిమానులు భగ్గుమన్నారు. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ఓ వర్గానికి బాగా నచ్చేసింది. ఈ క్రమంలోనే
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు కొనసాగింపు ఉంటుందని మొదటి పార్ట్ లోనే క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్లే ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
తొలి సీజన్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండో భాగంలో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేశ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ట్రైలర్ కట్లో కూడా ఎలాంటి అభ్యంతరకర సీన్స్, డైలాగులు లేవు. అయితే తొలి సీజన్‌కు మించిన యాక్షన్ సీన్స్, థ్రిల్‌ను రానా నాయుడు 2లో ఉన్నాయని పిస్తోంది. కాగా రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.
కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా తెరకెక్కించిన రానా నాయుడు సీజన్ 2 లో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియాలాంటి స్టార్ యాక్టర్లు నటించారు