కరోనా వల్ల కొన్ని నెలల పాటు థియేటర్లు మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీంతో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ కూడా ప్రకటించాయి. సినీ ప్రేక్షకులు కూడా సంబరపడిపోయారు. కానీ థియేటర్లు తెరుచుకోవడం లేదు. కారణం థియేటర్ ఓనర్స్ – ఎగ్జిబిటర్స్ – డిస్ట్రిబ్యూటర్స్ మధ్య నెలకొన్న వివాదాలే.
తాజా సమాచారం ప్రకారం యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఏ సినిమా కూడా రిలీజ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే గిల్డ్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన సమావేశాల్లో పలు అంశాలు చర్చకు వచ్చాయట. వారి మధ్య ఎప్పటి నుంచో వర్చువల్ ప్రాసెసింగ్ చార్జెస్ మరియు రెవెన్యూ షేరింగ్ విధానం.. తెలుగు సినిమాలకు తొలి ప్రాధాన్యత.. థియేటర్స్ లో ట్రైలర్స్ ప్రసారం చేసినందుకు అదనపు చార్జెస్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సినిమాలను విడుదల చేయకూడదని గిల్డ్ నిర్ణయించిందట. దీంతో సినీ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో సందడి చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేమిటీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.