Sing Geetham Movie Review: సింగ్ గీతం సినిమా రివ్యూ.. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ చేశారా..?

ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో ముందుండే పేరు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోయాయి. 94 ఏళ్ల వయస్సులో ఆయన నుంచి వచ్చిన అందమైన చందమామ కథ లాంటి సినిమా ‘సింగ్ గీతం’. నాగ్ అశ్విన్ విజన్ ఈ సినిమాకు తోడైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Sing Geetham Movie Review: సింగ్ గీతం సినిమా రివ్యూ.. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ చేశారా..?
Sing Geetham Movie Review

Edited By:

Updated on: Jun 12, 2026 | 1:27 PM

మూవీ రివ్యూ: సింగ్ గీతం

నటీనటులు: అయాన్, అహిల్యా బమ్రూ, షాలిని కొండెపూడి, బెనర్జీ, రాహుల్ రవీంద్రన్, తులసి, నివేత పేతురాజ్, విజయ్ దేవరకొండ (గెస్ట్ రోల్) తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: అంకూర్ సంజీవ్

దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు

నిర్మాత: నాగ్ అశ్విన్

ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో ముందుండే పేరు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోయాయి. 94 ఏళ్ల వయస్సులో ఆయన నుంచి వచ్చిన అందమైన చందమామ కథ లాంటి సినిమా ‘సింగ్ గీతం’. నాగ్ అశ్విన్ విజన్ ఈ సినిమాకు తోడైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

బీహార్ జైలు నుంచి తన సొంతూరు కుబేరపురంకు తండ్రి ఆస్తి కోసం వస్తాడు ప్రతాప్ మన్నెం (అయాన్). ఆయన తండ్రి ఉదయ్ మన్నెం (రాహుల్ రవీంద్రన్)కు ఆ ఊళ్లో బంగారు గనులు ఉంటాయి. దాంతో ఎలాగైనా అక్కడున్న గనులు అమ్మేసి సొమ్ము చేసుకోవానలి ఊరికి వస్తాడు ప్రతాప్. కానీ అప్పటికే ఆ బంగారు గనిని అమ్మి సంపాదించుకోవాలని బ్రహ్మయ్య (బెనర్జీ), ఆయన కూతురు రేణు (షాలిని కొండెపూడి) ఉంటారు. అక్కడ ఊరి జనంతో గనుల్లోకి తీసుకెళ్లి పనులు చేయిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక్క చెట్టు.. చివరి చెట్టులో వాళ్ల అమ్మను చూసుకుని అందులోనే ఉంటుంది గౌరీ (అహిల్యా బమ్రూ). చెట్టును కొట్టేసి గనులు తవ్వడానికి ఆమె ససేమిరా అంటుంది. కానీ ఆమెను పక్కనకు నెట్టేసి ఆ చెట్టు కొట్టేస్తారు. దాంతో ఆమె కుబేరుడి గుహలోకి వెళ్లి దేవుడినే నిలదీస్తుంది. అక్కడ్నుంచి ఆ ఊరికి శాపం తగులుతుంది.. మాటలు కాస్తా పాటలు అవుతాయి.. ఏదైనా పాట రూపంలోనే బయటికి వస్తుంది.. అలాగే నిజాలు బయటికి వస్తాయి.. అవన్నీ ఎలా ఆగుతాయి..? మళ్లీ మామూలు మనుషులు ఎలా అయ్యారు అనేది కథ..

కథనం:

కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. సింగ్ గీతం కూడా అలాంటి ఓ సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇది. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగ్ గీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు.. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటల్లేవు.. అన్నీ పాటలే..! ఏం చెప్పినా పాటలోనే.. ఈ ఆలోచనే చాలా క్రేజీగా ఉందసలు..! లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే.. ఇలాంటి స్టోరీ టెల్లింగ్‌లో సింగీతం గారు మాస్టర్. అయినా మూడున్నర దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు.. పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా..! ఓ అందమైన చందమామ కథలా సింగ్ గీతాన్ని తెరకెక్కించారు సింగీతం. ఫస్ట్ పావుగంట మాత్రమే మాటలు.. ఆ తర్వాత అంతా పాటలే. ఒక్కసారి మెయిన్ స్టోరీ మొదలయ్యాక ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది సినిమా. చెట్టు నాటాలి.. మంచి పెరగాలి.. మనిషిని మనిషిలా చూడాలి.. ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం గారు. కానీ ఆయన చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బాగా కుదిరింది.. క్లైమాక్స్‌లో వచ్చే గోల్డ్ మ్యాన్ సీన్స్ అయితే నెక్ట్స్ లెవల్. స్క్రీన్ మీద స్టార్స్ ఎవరూ లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించారు సింగీతం గారు. ఆయన టేకింగ్, ఆలోచన.. అన్నీ చాలా కొత్తగా అనిపించాయి.. గోల్డ్ మైన్స్ చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడూ రాలేదు. క్లైమాక్స్‌లో మనిషి మనిషికి సాయం చేయాలనే సీన్ సింగీతం గారు తెరకెక్కించిన తీరుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినా తప్పులేదేమో..? అంత బాగా రాసారాయన. కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయేమో కానీ బోర్ అయితే కొట్లవు. మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తోనే బయటికి వస్తాం.

నటీనటులు:

నటీనటులు అందరూ చాలా బాగా నటించారు.. కాదు కాదు పాడారు. ముఖ్యంగా కొత్త కుర్రాడు అయాన్ బాగున్నాడు.. అలాగే అహిల్యా బమ్రూ నటన చాలా ముద్దుగా అనిపిస్తుంది. తెలుగమ్మాయి షాలిని విలనిజం బాగుంది. వంశీధర్ రెడ్డి నవ్వించాడు. మిగిలిన వాళ్లంతా చాలా బాగున్నారు. చివర్లో ఒకే ఒక్క సీన్‌లో వచ్చినా కూడా విజయ్ దేవరకొండ అదరగొట్టేసాడు.

టెక్నికల్ టీం:

దేవీ శ్రీ ప్రసాద్ రేంజ్ ఏంటో ఈ సినిమాతో మరోసారి అర్థమైంది.. ఆయన పాటే సినిమాకు ప్రాణం.. ప్రతీ పాట అద్భుతంగా, వినసొంపుగా ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. అంకూర్ సంజీవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సింగ్ గీతం కోసం సింగీతం గారి ఆలోచనలకు తెరరూపం ఇచ్చిన నాగ్ అశ్విన్ కష్టాన్ని కూడా తక్కువ చేయకూడదు.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం గురించి ఏం చెప్తాం.. ఆయన ఓ అద్భుతం అంతే..!

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సింగ్ గీతం.. సింగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ..!

Follow Us